అర్హులకే అసైన్డ్‌!

6 Mar, 2018 01:11 IST|Sakshi

పరాధీనమైన భూముల రీఅసైన్‌మెంట్‌కు సర్కారు ఉత్తర్వులు

ఇతరుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూముల స్వాధీనం

అర్హత ఉంటే వారికే రీఅసైన్‌ చేయాలని నిర్ణయం

2017 డిసెంబర్‌ 31వ తేదీ కటాఫ్‌

భూమి లేని నిరుపేదలు.. సాగు, ఇంటి నిర్మాణమే అర్హత

కలెక్టర్లకు అధికారాలు.. వెంటనే అమలు చేయాలని ఆదేశం

ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు.. రియల్టర్లు

బడాబాబులకు ప్రయోజనం చేకూర్చుతుందనే విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పరాధీనమైన అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని.. అర్హత ఉంటే తిరిగి వారికే అసైన్‌ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఇతరుల చేతిలో ఉన్నాయని భూ ప్రక్షాళనలో గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి భూములను గుర్తించి, రీఅసైన్‌ చేసే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని సీసీఎల్‌ఏకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

దాదాపు 60 శాతం భూములు..
రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా.. అందులో దాదాపు 60 శాతం అసైన్డ్‌ భూములు లబ్ధిదారుల అధీనంలో లేవని, ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో ఇతరులపరం కావడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం.. అలాంటి భూములన్నింటినీ అర్హులైన వారికి రీఅసైన్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ మెమో (నం.4233) జారీ చేశారు. దీని ప్రకారం.. లబ్ధిదారులు కాకుండా ఆక్రమణలో ఉన్న అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉంటే వారికి తిరిగి పంపిణీ (రీఅసైన్‌) చేస్తుంది. 2017 డిసెంబరు 31వ తేదీ నాటికి అసైన్డ్‌ భూములను కొనుగోలు లేదా బదిలీ చేసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇలా రీఅసైన్‌ చేసేటప్పుడు భూమి లేని నిరుపేదలు, ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న వారు, ఇంటిని నిర్మించుకున్న వారిని అర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కలెక్టర్లకు అధికారాలు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే 2017 డిసెంబరు 31వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించటంతో.. ఆక్రమణలో ఉన్న వారిలో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆ తేదీ నాటికి అసైన్డ్‌ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో.. వారి పేరిట రీఅసైన్‌ చేస్తారు.

ఇక తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) యాక్ట్‌–1977 ప్రకారం అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకోవాలన్నా, తిరిగి ఇతరులకు అప్పగించాలన్నా అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కమిటీలకు బదులుగా జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

బడాబాబులకే ప్రయోజనం!
అసైన్డ్‌ భూముల రీఅసైన్‌మెంట్‌ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలకు గురైన అసైన్డ్‌ భూములన్నీ బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్నాయని.. ప్రభుత్వ నిర్ణయం వారికి ప్రయోజనకరంగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ భూములు ఆధీనంలో ఉన్నవారికి రీఅసైన్‌ చేయాలన్న నిర్ణయంతో.. భూములన్నీ బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు