సాగు సంబురం

5 Jun, 2018 01:18 IST|Sakshi

కరెంటు నుంచి మద్దతు ధర దాకా అంతా పక్కా: కేసీఆర్‌

వచ్చే జూన్‌ తర్వాత కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపుతం

వాటిలో ఏడాదంతా నీళ్లుంటాయి 

రైతు కాలు మీద కాలు వేసుకుని ధీమాగా ఉండే పరిస్థితి తెస్తం 

ఎల్‌ఐసీతో రైతు జీవిత బీమా ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘ఇంతకాలం రైతులు మొగులుకు ముఖం పెట్టి చూసేవారు. తెలంగాణ రైతుకు ఇక ఆ కష్టం దూరమైతది. వచ్చే సంవత్సరం జూన్‌ తర్వాత కాళేశ్వరంతో అనుసంధానం ఏర్పడగానే చెరువులు 365 రోజులు నీటితో కళకళలాడుతై. అవి ఎండకుండా నింపుతనే ఉంటం. అప్పుడు రోహిణి కార్తెలనే నాట్లేస్తం. రోహిణికి ముందొచ్చే కృత్తిక కార్తెలనే మొక్కజొన్న విత్తనాలేస్తం. ఈ అద్భుత దృశ్యాన్ని చల్లగా బతికి కళ్లారా చూడాలనుకుంటున్న..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అటెండరైనా సరే ఉద్యోగితో పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటున్నోళ్లు రైతు అనగానే ముఖం తిప్పుకుంటున్నారని, ఈ దుస్థితిని మారుస్తామని ఉద్ఘాటించారు. రైతులు మంచి ఆదాయంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చునే పరిస్థితి కల్పిస్తామని చెప్పారు. ‘‘నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. నీటి వసతి కల్పిస్తున్నం. అప్పు చేయకుండా పెట్టుబడి సాయం చేస్తున్నం. మెరుగైన సాగుకు రాయితీతో యంత్రాలు సమకూరుస్తున్నం. పంట చేతికొచ్చాక మద్దతు ధర అందేలా చూస్తం. ఇప్పటిదాకా వైకుంఠపాళిలో పెద్దపాము మింగిన తరహాలో నష్టపోతున్న రైతుల బాధలు దూరం చేసేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొస్తే కొందరు ఈకలు తోకలు పీకే ప్రయత్నం చేస్తున్నరు’’అని విమర్శించారు. 

టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రైతుబంధు, జీవిత బీమా పథకాలపై అవగాహన సదస్సు జరిగింది. ఇందులో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్తలు, మండల సమన్వయ కర్తలు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల జీవిత బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. రైతు కష్టాలు దూరం చేసేందుకు తమ ప్రభుత్వం నడుం బిగించి, మంచిరోజులు తెచ్చిందన్నారు. ‘‘రెప్పపాటు సేపు కూడా కరెంటు పోవటం లేదు. ఇక మోటార్లు కాలిపోయే పరిస్థితి ఎక్కడిది? అందుకే తెలంగాణలో మోటార్ల మరమ్మతు కేంద్రాలు, జనరేటర్‌ కేంద్రాలు దివాలా తీసినై. వాటి నిర్వాహకులను వేరే ఉపాధి వెతుక్కోమని చెప్పినం’’అని అన్నారు.

సరైన సాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రాంత నేల స్వభావం, వాతావరణ పరిస్థితి, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలు సూచిస్తారని, వాటినే సాగు చేయాలని పేర్కొన్నారు. ఒకే రకమైన పంట వేసి రైతుకు రైతే పోటీ అయ్యే పరిస్థితిని నివారించాలన్నారు. డిమాండ్‌ ఉన్నవాటిని గుర్తించి ఆ పంటలే వేయాలన్నారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ రైతులు అనుసరిస్తున్న సొంత మార్కెట్‌ కమిటీ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఆ తరహాలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, అవసరమైతే దాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖలో ఓ పోస్టును, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. పంటలకు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌పై సర్వే చేసి రైతులకు సూచనలిచ్చే బాధ్యత ఆ అధికారి ఆధ్వర్యంలోని బృందానిదేనని చెప్పారు.  

ఉపాయంతో వ్యవసాయం చేయాలి 
పాత పద్ధతులు వదిలేసి సాగును యాంత్రీకరించేందుకు నడుం బిగించామని సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ సమీపంలోని వీఎన్‌ఆర్‌ షీట్స్‌ ఆధ్వర్యంలో క్లస్టర్ల నిర్వహణ బాగా ఉందని, దాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. ఆ తరహాలో యాంత్రీకరణకు అవకాశం కల్పిస్తామని, పంట అమ్మడం కూడా నియంత్రిత విధానంలో ఉండాలని పేర్కొన్నారు. ‘‘నిత్యం ఆ క్లస్టర్‌ పరిధిలోని మూడు నాలుగు ఊళ్ల నుంచి మాత్రమే ధాన్యం మార్కెట్‌కు వస్తది. కొద్దిసేపట్లో విక్రయం పూర్తయి రైతు డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇలా క్రమ పద్ధతిలో రావాలంటే ఏ గ్రామంలో ఏ పంట వేశారో, ఎప్పుడు మార్కెట్‌కు తెచ్చే అవకాశం ఉందో సమాచారం అంతా సిద్ధంగా ఉండాలి. పట్టణాలకు చేరువగా కూరగాయల సాగు చేస్తే రైతులు ధనవంతులు అవుతారు. ధాన్యం ఎక్కువగా వచ్చి మార్కెట్‌లో వ్యాపారులు ధర తగ్గిస్తే రైతులు అమ్మొద్దు. ఇలా జరిగితే ఆ విషయాన్ని రైతు సమన్వయ సమితి చైర్మన్‌ దృష్టికి తేవాలి. ఈ సంఘటితత్వంతో వ్యాపారులే దిగొచ్చి ధర పెట్టేందుకు సిద్ధపడతారు. ఇలా ఉపాయంతో వ్యవసాయం చేసి దేశంలో తెలంగాణ రైతు తెలివైనోడనే పేరు సంపాదించాలి’’అని సూచించారు. 
 

కౌలు రైతులకు ‘రైతు బంధు’ఇవ్వం 
రైతుబంధు పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు ఇవ్వబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఆ సాయం పొందుతున్నవారిలో 92 శాతం ఐదాకరాలున్న సాధారణ రైతులేనని, 54 లక్షల మంది రైతుల్లో 18 లక్షల మంది ఒక ఎకరం పొలం ఉన్నవారేనని పేర్కొన్నారు. ఇప్పటికి రూ.5 వేల కోట్లు డ్రా చేసుకున్నారని, ఇందులో రూ.4,956 కోట్లు సాధారణ రైతులే పొందారని, ధనవంతులైన పెద్ద రైతుల సంఖ్య అత్యల్పమని, వారిలో కొందరు ఆ సాయాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నారని వివరించారు. ఇలా వెనక్కు వచ్చిన మొత్తం కూడా తిరిగి రైతుకే ఉపయోపడేలా రైతు సమన్వయ సమితి వద్దే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘కొందరు అనారోగ్యం లాంటి కారణాలతో ఓ సంవత్సరం కౌలుకు ఇస్తారు. ఆ తర్వాత మరొకరికి ఇస్తారు. తర్వాత సొంతంగా చేసుకుంటరు. ఇలాంటప్పుడు ఏ కౌలు రైతును గుర్తిస్తం. ఈ వివరాలు తెలుసుకునుడే సర్కారు పనా?’’అని సీఎం అన్నారు. కొందరు పేరుకు పెద్ద రైతులైనా సరైన సాగు లేక వారూ అప్పుల్లోనే ఉన్నారంటూ, ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన 60 ఎకరాల రైతు తనను కలిసి తీరును వివరించారు. అతను హైదరాబాద్‌లో కూలీ పని చేసుకున్నట్టు పేర్కొన్నారు. కొందరు నేతలు కౌలు రైతులకు సాయం చేయడం లేదని విమర్శిస్తున్నారని, వారికి సాయం సాధ్యం కాదని స్పష్టంచేశారు. అద్దె భవనాల్లో ఉండే కిరాయిదారులకు వాటిని రాసివ్వగలుతారా అని ప్రశ్నించారు. రామ, రావణ యుద్ధంలో అర్ధాయుష్షుతో చనిపోయిన రాక్షసులు ఈ జన్మలో ప్రజలను పీక్కుతినే నేతలుగా పుట్టారని, వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ నవ్వులు పూయించారు.  

కమతాల ఏకీకరణ జరగాలి
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలో ఒకే వ్యక్తికి ఉన్న కమతాలు ఒకేచోటకి చేరేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రైతులు పరస్పరం మాట్లాడుకుని ఆ భూముల »బదలాయింపుతో కమతాలను ఒకేచోటకు మార్చుకోవాలని సూచించారు. పంట దిగుబడి అధికంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరమని, ఇందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాలని సూచించారు. రెండేళ్ల కాలంలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు, పచ్చిరొట్టె వాడకాన్ని ప్రోత్సహించాలని, ఫాస్పేట్‌ వాడకం తగ్గించాలని సూచించారు. 

ఎల్‌ఐసీతో అతిపెద్ద డీల్‌ 
అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీతో రైతు బీమా ఒప్పందం చేసుకోవటం ద్వారా దాని పరిధిలో ఇప్పుడు అతిపెద్ద బీమా గ్రూపుగా నిలిచినట్టు ముఖ్యమంత్రి అన్నారు. క్లెయిమ్‌ చేసిన 10 రోజుల్లో బీమా మొత్తాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్‌ఐసీ చైర్మన్‌ శర్మ సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి–ఎల్‌ఐసీ ఆర్‌ఎం శాస్త్రిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు శ్రేయస్సు కోసం రైతుబంధు వంటి గొప్ప పథకం ప్రారంభించిన నేత దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనని ఎల్‌ఐసీ చైర్మన్‌ శర్మ కితాబిచ్చారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని పేర్కొన్నారు. రైతుబంధు పథకం చెక్కులు బ్యాంకులో వేశాక నగదు కొరత సాకు చూపితే ఆర్‌బీఐ ముందు మంత్రులతో కలిసి నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించానని, ఆ భయంతో బ్యాంకర్లు రైతులకు వెంటనే డబ్బులిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఆగస్టు 15 నుంచి బీమా అమల్లోకి వస్తున్నందున ఆ లోపే తప్పుల్లేకుండా రైతుల వివరాలు, నామినీ పేరు, సెల్‌ నంబర్‌తో సహా అందించే బాధ్యత మండల వ్యవసాయ విస్తరణాధికారులదేనని చెప్పారు. సహజ మరణం అయినా 10 రోజుల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము రైతు కుటుంబానికి అందుతుందని, డెత్‌ సర్టిఫికెట్‌ ఇస్తే చాలని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామపంచాయితీ కార్యాలయాల్లో కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు