మిడతల దండు వాలగానే వేసేద్దాం

28 Jun, 2020 04:07 IST|Sakshi

మిడతలపై వ్యూహం ఖరారు!

స్ప్రేలు, పురుగు మందులు సిద్ధం చేసిన యంత్రాంగం

కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

రసాయనాలు, పీపీఈ కిట్లకు రూ. 53.55 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి ఏ సమయంలోనైనా మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడతల నిరోధక చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్న మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చేందుకు అవకాశాలు అలాగే ఉన్నందున, తగిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మిడతల దండును ఎదుర్కోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. (మిడతల దండు మళ్లీ వచ్చేసింది)

సాధారణంగా మిడతల దండు ఉదయం వేళ ప్రయాణం చేస్తుంటుంది. ఈ సమయంలో వీటిని చంపడం అంత సులువు కాదు. చెట్లపై, చేనుపై వాలినపుడే వాటిని చంపేందుకు సులువవుతోంది. దీంతో రాత్రివేళ, వేకువజామున మిడతలను చంపేందుకు సిద్ధపడాలని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు. ముందుగా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే సరిహద్దు జిల్లాలను గుర్తించాలి. అన్ని గ్రామాలలోనూ మిడతలు ప్రవేశించే మార్గాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాకు 500 లీటర్ల రసాయనాలను సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగు కలిపిన నీటితో గ్రామాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. వీటన్నింటిపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ విడుదల చేయనుంది. (ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!)

రూ. 53.55 లక్షలు కేటాయింపు...
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రసాయనాల కొనుగోలుకు, పీపీఈ కిట్లకు జిల్లాకు రూ. 5.95 లక్షల చొప్పున రూ. 53.55 లక్షలు కేటాయించింది. ఈ నిధులను విపత్తు నిర్వహణ నిధుల నుంచి వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. (కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు...)

జిల్లా కలెక్టర్, కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు లేదా ఎస్పీ, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఫైర్‌ అధికారి, డీపీవోతో పాటు జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నుంచి కీటక శాస్త్రవేత్తతో కలిపి ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మిడతల దాడి జరిగే అన్ని మండలాలు, సరిహద్దు గ్రామాలలో గ్రామ కమిటీలను గుర్తించాలి. ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, సమూహాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. మిడతలు ప్రవేశించే స్థలాలను గుర్తించి, వాటిని చంపేందుకు స్ప్రే చేయడానికి తగిన స్థలాన్ని గుర్తించాలి. భారీ వాహనాలు, ఫైరింజన్లు వెంటనే వచ్చేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.

రాత్రివేళ పిచికారీ చేయాల్సి ఉన్నందున లైటింగ్‌ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నందున పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. పంటలకు, పశుపక్షాదులకు ఎటువంటి ఆరోగ్య, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. మొక్కల నర్సరీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేప పూత ముందుగా చల్లుకోవడం మంచిది. అటవీ ప్రాంతం అయితే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున కమ్యూనికేషన్‌ సెట్‌ వినియోగించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు