సర్పంచులకే చెక్‌ పవర్‌!

25 Feb, 2018 02:03 IST|Sakshi

పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలపై సర్కారు కసరత్తు

సాక్షి, హైదరాబాద్ ‌: పంచాయతీరాజ్‌ చట్టానికి కీలక సవరణలు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాల్లో సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టేలా చర్యలు చేపడుతోంది. ఇకపై చెక్‌ పవర్‌ను సర్పంచులకే అప్పగించాలని నిర్ణయించింది. గ్రామాభివృద్ధికి నిధులను ఖర్చుచేసే విషయంలో కీలకమైన చెక్‌ పవర్‌ ప్రస్తుతం సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి కలిపి ఉమ్మడిగా (జాయింట్‌ చెక్‌ పవర్‌) ఉంది.

ఇప్పుడు ప్రభుత్వం సర్పంచ్‌లకే పూర్తిగా చెక్‌ పవర్‌ను అప్పగించాలని నిర్ణయించింది. ఇక గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్‌ కాలపరిమితిని కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రొటేషన్‌ పద్ధతిలో ప్రతి ఐదేళ్లకోసారి రిజర్వేషన్‌ మారిపోతుంది. దీనిని పదేళ్లకు పెంచేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.

ఇక గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం మహిళలకు 33% రిజర్వేషన్‌ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని యోచిస్తున్నారు. మొత్తంగా పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు ను ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు