మెట్రో జర్నీకి బ్రేకులు వేస్తున్నాయి..

20 Jun, 2020 11:34 IST|Sakshi

కోవిడ్‌ కారణంగా డిపోలకే పరిమితమైన రైళ్లు

మూణ్నెల్లలో రూ.150 కోట్ల ఆదాయానికి గండి    

భౌతిక దూరం, శానిటేషన్‌కు సిద్ధమని ప్రకటన

అయినా రైళ్ల అనుమతులకు కేంద్రం అభ్యంతరం

ఈ మాసంలోనూ మెట్రో పట్టాలెక్కడం కష్టమే..  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో నష్టాల బాటన సాగుతోంది. గత మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు మెట్రో జర్నీకి బ్రేకులు వేస్తున్నాయి. కరోనా కలకలం నేపథ్యంలో మార్చి 22 నుంచి నిలిచిన రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. అడపాదడపా రైళ్లకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి వాణిజ్య రాకపోకలకు సిద్ధం చేసినప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం మెట్రో అధికారులు ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెలలో దాదాపు మెట్రో పరుగులు లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

జాగ్రత్తలు తీసుకున్నా కదలని రైళ్లు..
ప్రారంభించిన అనతికాలంలోనే గ్రేటర్‌ సిటీజన్ల మనసు దోచుకున్న మెట్రో రైళ్లలో లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజూ సరాసరి 4 లక్షల మంది ప్రయాణం చేసేవారు. కోవిడ్‌ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారు తరచూ తాకే, నిల్చునే ప్రాంతాలను శానిటైజ్‌ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైళ్లను నిలపకూడదని అనుకున్నారు. కానీ కోవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినీయకపోవడంతో మెట్రో రైళ్లు పట్టాలెక్కడంలేదు.  

నిర్వహణ ఖర్చు తడిసి మోపెడు..
గ్రేటర్‌లో ప్రస్తుతం ఎల్భీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం.. వెరసీ.. 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం సేకరించడంతోపాటు సొంత నిధులు కలిపి మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసింది. లాక్‌డౌన్‌కు ముందు నెలకు రూ.50 కోట్ల ఆదాయంతో లాభాలు, నష్టాలు రాని దశకు చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్‌ పంజా విసిరింది. దీంతో కలల రైలుకు నష్టాల పయనం ఎదురవుతోంది. గత మూడు నెలలుగా ప్రయాణికుల చార్జీలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోవడంతో పాటు మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు తడిసి మోపడవుతోంది.  

వచ్చే నెలలోనైనా?
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలలో మెట్రో రైళ్ల రాకపోకలకు దాదాపు అనుమతులు నిరాకరించే అవకాశాలున్నాయి. దీంతో సిటీజన్లకు మెట్రో జర్నీ ఉండదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే నెల లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడిపే అవకాశాలుంటాయని మెట్రో అధికారులు తెలిపారు.

రెండో దశ లేనట్టే..
నగరంలో మెట్రో తొలి దశకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో పలు మార్గాల్లో మెట్రో రెండోదశ చేపట్టాలన్న విజ్ఙప్తులు ఇటు ప్రజాప్రతినిధులు.. అటు ప్రజల నుంచి వినిపించాయి. కానీ ఒకవైపు ప్రభుత్వానికి నిధుల లేమి.. తాజాగా కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో రెండోదశకు ఇప్పట్లో బాటలు పడే అవకాశాలుండవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు