కరోనా ఎఫెక్ట్‌! వీకే సింగ్‌పై బదిలీ వేటు

28 Jun, 2020 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావుకు టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. 
(చదవండి: రాజకీయాల్లో చేరను: వీకే సింగ్‌)

కారణాలివేనా
కాగా, తనకు ప్రి మెచ్యూర్ రిటైర్మెంట్ కావాలని ఈనెల 24న కేంద్ర హోం మంత్రికి వీకే సింగ్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పోలీసు అకాడెమీలో 180 మందికి కరోనా సోకినట్టుగా వీకే సింగ్‌ నేడు ధ్రువీకరించారు. అయితే, ప్రభుత్వ ప్రకటన వెలువడకముందే కేసుల విషయాన్ని బహిర్గతం చేయడం కూడా వీకే సింగ్‌ బదిలీకి కారణం కావొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీస్‌ అకాడమీలో మొత్తం 200 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం.
(చదవండి: తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం)

మరిన్ని వార్తలు