ఇక ఈ–ఆఫీస్‌

7 Jul, 2020 03:29 IST|Sakshi

వారం–పది రోజుల్లో అమల్లోకి

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

భౌతికంగా మానవ ప్రమేయం తగ్గింపే లక్ష్యం 

ఫైళ్ల కదలికలన్నీ ఈ–ఆఫీస్‌ ద్వారానే..

పెరగనున్న వేగం, పారదర్శకత

ఉద్యోగులకు ఈ–ఆఫీస్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌

తమ విధులను ఇళ్ల నుంచే చేసుకోవచ్చు!

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పాలన వ్యవహారాల్లో భౌతికంగా మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పది రోజుల్లో ‘ఈ–ఆఫీస్‌’విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. భౌతికంగా ఫైళ్లను ఒక చోట నుంచి మరో చోటకి సర్క్యులేట్‌ చేయడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉండడంతో ‘ఈ–ఆఫీస్‌’సాఫ్ట్‌వేర్‌ ద్వారానే ఇకపై ఫైళ్లను సర్క్యులేట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు పారదర్శకత, విశ్వసనీయత కూడా పెరగనుందని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్స్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, ఎండోమెంట్‌ విభాగాల్లో తొలుత ఈ–ఆఫీస్‌ను ప్రవేశపెట్టనుంది. 

అనంతరం ఇతర అన్ని శాఖలకు విస్తరింపజేయనుంది. ఈ–ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇప్పటికే సిద్ధం కాగా, క్షేత్ర స్థాయిల్లో అన్ని జిల్లాల్లో దీని అమలుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వివరాలతో మాస్టర్‌ డేటాబేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి సేకరిస్తోంది. ఉద్యోగుల పేరు, కోడ్, లింగం, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్, పాన్, మొబైల్‌ నంబర్లు, మెయిల్‌ లాగిన్‌ ఐడీ, జాయినింగ్‌ తేదీ, రిటైర్మైంట్‌ తేదీ, శాఖ పేరు, హోదా, రెగ్యూలర్‌/తాత్కాలిక, రిపోర్టింగ్‌ ఆఫీసర్‌ తదితర అన్ని వివరాలు ఇందులో ఉండనున్నాయి. ఈ–ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి విధులు నిర్వహించేందుకు వీలుగా ఉద్యోగులకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయించనున్నారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ ఆఫీస్‌లోకి ప్రవేశించి డిజిటల్‌ ఫైళ్ల సృష్టి, నిర్వహణలతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించవచ్చు. 

ప్రతీ అధికారికి ప్రత్యేకంగా ఓ ఎన్క్రిప్టెడ్‌ డిజిటల్‌ కీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దాంట్లోని డేటా, సమాచారం, ఇతర ఫైళ్లు టాంపర్‌కు గురికాకుండా భద్రంగా ఉండే విధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌తోపాటు ఈ ముద్ర అప్లికేషన్‌ ద్వారా వాళ్ళ డిజిటల్‌ సంతకాలను ఈ నెల 7లోగా సేకరించి సిద్ధంగా ఉంచాలని, ఇందుకోసం 6లోగా ప్రతి శాఖ ఓ నోడల్‌ అధికారిని నియమించుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8లోగా ఫైళ్ల డిజిటలైజేషన్, 9లోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసి, జూలై రెండోవారం నుంచే ఈ–ఆఫీస్‌ ద్వారా ఆన్‌లైన్‌ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెరగనున్న పారదర్శకత...
రాష్ట్ర సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాల యం నుంచి జిల్లా, మండల స్థాయి వరకు పరిపాలన వ్యవహారాల్లో ఈ–ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయంలో సెక్షన్‌ అధికారి నుంచి కార్యదర్శి స్థాయి వరకు అధికారుల హైరార్కీ మ్యాపింగ్‌ నిర్వహిస్తోంది. మామూలు పరిస్థితుల్లో లాగా రోజువారీ ఫైళ్ల నిర్వహణలో గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైళ్ల కదలిక నిరంతరం తెలిసేలా, నిర్దిష్ట సమయంలో అది ఏ అధికారి దగ్గర ఉంది, ఫైల్‌ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది తదితర వివరాలను ట్రాక్‌ చేసేలా, ఫైళ్ల నిర్వహణ పారదర్శకంగా జరిగేలా ఈ– ఆఫీస్‌ దోహదపడుతుంది. ఫైల్‌ కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తమ మొబైల్లో వచ్చే అలెర్ట్‌ల ద్వారా, లేదా ఈ మెయిళ్ల ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ఆఫీస్‌ను త్వరలో అన్ని శాఖల్లో అమలుచేసి, అధికారులు, సిబ్బంది ఇంట్లో ఉన్నా పనయ్యేట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

మరిన్ని వార్తలు