సిటీ, పల్లె వెలుగు కనీస చార్జీ రూ.10

30 Nov, 2019 02:30 IST|Sakshi

కేసీఆర్‌ ఆమోదిస్తే సోమవారం నుంచి కొత్త ధరలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీ సర్వీసులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు బస్సు సర్వీసుల కనిష్ట టికెట్‌ ధరను రూ. 10గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ చార్జీ రూ. 5గా ఉంది. టికెట్‌ చార్జీ పెంచితే తప్ప ఆర్టీసీ మనుగడ అసాధ్యంగా మారడంతో కి.మీ.కి 20 పైసల చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఈ మేరకు అధికారులు శుక్రవారం కసరత్తు చేసి కొత్త టికెట్‌ ధరలను ప్రాథమికంగా నిర్ణయించారు.

సిటీ ఆవల తిరిగే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల లాంటి సాధారణ సర్వీసులకు ప్రస్తుత చార్జీపై కి.మీ.కి 20 పైసలు చొప్పున పెంచనున్నారు. చిల్లర సమస్య రాకుండా దాన్ని తదుపరి మొత్తానికి పెంచుతారు. కానీ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్న సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల విషయంలో కనిష్ట మొత్తాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. అయితే కి.మీ.కి 20 పైసల చొప్పున పెంపునకే సీఎం అనుమతించినందున కనిష్ట మొత్తాన్ని రెట్టింపు చేసే అంశాన్ని శనివారం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయన అనుమతిస్తే శనివారం సాయంత్రానికి తుది టికెట్‌ ధరలను ప్రకటించి సోమవారం నుంచి పెంచిన చార్జీలు అమలు చేయనున్నారు.

హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాలకు చార్జీలు ఇలా... 
చార్జీల పెంపుతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు అన్ని కేటగిరీ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలు దాదాపు రూ. 55 మేర పెరుగుతాయి. అలాగే కరీంనగర్‌కు రూ. 32, వరంగల్‌కు రూ. 30, నిజామాబాద్‌కు రూ. 35, ఖమ్మంకు రూ. 45, ఆదిలాబాద్‌కు రూ. 60 మేర పెరుగుతాయి.

ఉదాహరణకు ప్రస్తుతం నగరం నుంచి విజయవాడకు సూపర్‌ లగ్జరీ చార్జీ రూ. 315గా ఉంది. దీన్ని రూ. 370కి పెంచుతారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు ఎక్స్‌ప్రెస్‌ చార్జీ రూ. 140 ఉంది. దాన్ని రూ. 175కు పెంచుతారు. కి.మీ.కి 20 పైసల చొప్పున పెంచుతూ చిల్లర సమస్య రాకుండా ఆ మొత్తాన్ని సర్దుతారు. రోడ్డు సెస్, టోల్‌ వ్యయాల వల్ల చార్జీల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి అన్ని డిపోలకు తుది చార్జీల పట్టికను అధికారులు పంపనున్నారు.

మరిన్ని వార్తలు