విధుల్లోకి జూనియర్‌ డాక్టర్లు

13 Jun, 2020 01:42 IST|Sakshi

ప్రభుత్వ హామీలతో ‘గాంధీ’లో ఆందోళన విరమణ

పక్షం రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం

పోస్టుల భర్తీ... భద్రతకు ప్రభుత్వం సుముఖత

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, బంధువులు దాడికి పాల్పడటంతో నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. తమ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెంటనే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జూనియర్‌ డాక్టర్ల సంఘం గాంధీ ఆస్పత్రి విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నా...
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేస్తున్నామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగుల బంధువులు తమపై దాడులకు దిగడం ఏమిటంటూ జూనియర్‌ డాక్టర్లు మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూనే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రత అందించాలని డిమాండ్‌ చేశారు. రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌)ను ఏర్పాటు చేయడంతోపాటు ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలనే డిమాండ్‌ను మంత్రికి వివరించారు.

అలాగే సకల సౌకర్యాలున్న గాంధీ ఆస్పత్రిని కేవలం కరోనా చికిత్సకే పరిమితం చేయకుండా అన్ని రకాల రోగులను అనుమతించాలని కోరారు. ప్రస్తుతం పడకల సంఖ్య ఆధారంగా పోస్టులు మంజూరు చేసినప్పటికీ 30% అదనపు పోస్టులు మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. రిజర్వ్‌ స్టాఫ్‌ ఉంటేనే వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి ఉండదని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.  కరోనా చికిత్సలను గాంధీ తదితర ఆస్పత్రులకే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తే గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గుతుందని కోరారు. వైద్యులు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, ఇతరాలను జూనియర్‌ డాక్టర్ల సమ్మతితో కొనుగోలు చేయాలని సూచించారు.

పక్షం రోజుల్లో రోడ్‌మ్యాప్‌...
జూనియర్‌ డాక్టర్ల సంఘం డిమాండ్లపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కరోనా అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆందోళన విరమించాలని సూచిస్తూనే వారి డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజుల్లో మార్గం చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌ వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. చర్చల తాలూకూ అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించిన తర్వాత కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, ఈలోగా విధుల్లో చేరి వైద్యసేవలను ప్రారంభించాలని కోరారు. దీంతో సమ్మతించిన జూనియర్‌ డాక్టర్ల సంఘ ప్రతినిధులు విధుల్లో చేరేందుకు సముఖత చూపారు. పక్షం రోజుల్లో పరిష్కారం చూపకుంటే మాత్రం మళ్లీ ఆందోళన చేపడతామని జూనియర్‌ డాక్టర్ల సంఘం పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు