రుణమాఫీకి సిద్ధం

9 May, 2020 12:14 IST|Sakshi

తొలి విడతలో రూ.25వేలలోపు లోన్లకు వర్తింపు

సాక్షిపతినిధి, ఖమ్మం: రైతులు పంటల సాగుకోసం బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల మాఫీకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో రూ.25వేల లోపు లోన్లను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత రూ.లక్షలోపు వారికి నాలుగు విడతల్లో విముక్తి కల్పించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష రూపాయలలోపు పంట రుణాన్ని మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హామీ ఇవ్వడంతో..ప్రభుత్వం ఇప్పుడు అమలుకు పూనుకుంది. దీంతో 2018, డిసెంబర్‌ 11వ తేదీలోపు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. 2.63 లక్షల మంది కర్షకులు రూ.2,324 కోట్లు తీసుకున్నట్లు అంచనా. ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతోపాటు ఏపీజీవీబీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకుల్లో పొందిన పంట రుణాలను మాఫీ చేయనున్నారు.

జాబితా రాగానే..
అర్హులైన రైతుల వివరాలను ఆయా బ్యాంకులు వారి ప్రధాన కార్యాలయాలకు పంపించాయి. మాఫీ అవుతున్న రుణం విలువకు సంబంధించి ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్‌ లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ)నుంచి జిల్లాలకు జాబితా అందాల్సి ఉంది. ఆ తర్వాత మాఫీ ప్రక్రియ షురూ కానుంది. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందారు. రూ.1,630కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో వెచ్చించింది.

ప్రభుత్వ ఆదేశాలతోనే..
రుణమాఫీ ప్రక్రియపై ప్రభుత్వ ఆదేశాలందడంతో చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి వివరాలను సేకరించి సిద్ధం చేస్తున్నాం. ఎస్‌ఎల్‌బీసీ నుంచి జాబితా వచ్చాక జిల్లాలో ఆచరిస్తాం. – సీహెచ్‌.చంద్రశేఖర్‌రావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్, ఖమ్మం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా