ముందు కట్టండి.. తర్వాత ఇస్తాం!

18 Aug, 2014 01:38 IST|Sakshi


 రుణమాఫీపైటీ సర్కారు కొత్త ఆలోచన
 
 సాక్షి, హైదరాబాద్: ‘ముందు మీరు రుణాలు చెల్లించండి.. మీకు మేం బాండ్లు ఇస్తాం.. రెండు, మూడేళ్లలో వడ్డీతో కలిపి చెల్లిస్తాం..’.. రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన ఇది. ఇప్పటిదాకా రైతుల రుణాలను తామే చెల్లిస్తామని చెబుతూ వచ్చిన సర్కారు.. రీషెడ్యూల్‌కు రిజర్వు బ్యాంకు అనుమతించే అవకాశం కనిపించకపోవడంతో పాటు నిధుల సమీకరణ కష్టంగా మారడంతో రైతులకు ఇలా బాండ్లు జారీ చేయాలని యోచిస్తోంది. సీఎం కేసీఆర్  సైతం ఈ అంశాన్ని అంతర్గత సంభాషణల్లో మంత్రులు, అధికారుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతులు బ్యాంకులకు తమ రుణాలను చెల్లించగలరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులు దీనితో ఆందోళనలో మునిగిపోకతప్పదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
 
  తెలంగాణలో రైతుల రుణాలు దాదాపు రూ. 17,337 కోట్ల వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలను కూడా జారీ చేసింది కూడా. రైతు రుణమాఫీ అంశంపై రిజర్వుబ్యాంకు వద్దకు ఆర్థిక శాఖ అధికారులు వెళ్లాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ అత్యవసర సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రిజర్వుబ్యాంకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం విజ్ఞప్తి చేసి పక్షం రోజులు కావస్తున్నా.. ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకులకు రుణాలను చెల్లిస్తే.. బాండ్లు జారీ చేయాలన్న యోచనకు వచ్చినట్లు తెలిసింది. అయితే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇలా వచ్చి అలా పోతోందని... రుణమాఫీకి సంబంధించి రిజర్వుబ్యాంకు మాత్రం ఒకేసారి మొత్తం సొమ్ము బ్యాంకులకు చెల్లించాలని చెబుతోందని ప్రభుత్వ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అలా చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సాధారణంగా రుణాల రీషెడ్యూల్ నాలుగైదేళ్లు ఉంటుందని, దీనికి రిజర్వుబ్యాంకు అంగీకరిస్తే... మాఫీ చేయాల్సిన రూ. 17,337 కోట్లలో మొదట ఐదువేల కోట్లు నేరుగా బ్యాంకులకు చెల్లించవచ్చన్నారు. మిగతా రూ. 12 వేలకోట్ల పైచీలుకు రుణాలకు సంబంధించి ఏటా వడ్డీతో పాటు కొంత అసలును చెల్లించుకుంటూ వెళ్లడం ఒక పద్ధతి అని ఆ ముఖ్యుడు పేర్కొన్నారు. ఇలా వడ్డీ చెల్లించడం భారమైనప్పటికీ.. అది తప్పదన్నారు. అయితే రిజర్వుబ్యాంకు దీనికి కూడా అంగీకరించే అవకాశం లేనందున... రైతులకు బాండ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. రుణమాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత బాండ్ల జారీ అంటే రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దామని కూడా మంత్రులు, అధికారుల వద్ద జరిగే అంతర్గత సంభాషణల్లో ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే రెండు మూడేళ్ల తరువాత కూడా రుణాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే ఏమిటన్న దానిపై కూడా చర్చలు సాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు