ఎట్టకేలకు చెక్‌ పవర్‌

17 Jun, 2019 10:27 IST|Sakshi
మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయం

మోర్తాడ్‌/ధర్పల్లి/నిజామాబాద్‌అర్బన్‌: నాలుగున్నర నెలల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెర పడింది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఇద్దరికి కలిపి చెక్‌పవర్‌ అప్పగించింది. బాధ్యతలను స్వీకరించిన తర్వాత నాలుగున్నర నెలల పాటు నిధుల వినియోగానికి అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. కొంత మంది సర్పంచ్‌లు మాత్రం సొంత నిధులు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పిస్తూ వచ్చారు. అయితే, ఎట్టకేలకు చెక్‌ పవర్‌ రానుండడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జూలై 17 నుంచి పంచాయతీల్లో చెక్‌ పవర్‌ అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవో నెం.30 జారీ చేసింది.
 
నాలుగున్నర నెలులుగా ఖాళీగానే.. 
రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతుండటంతో కోడ్‌ అమలు ఉన్నందున పంచాయతీలకు చెక్‌ పవర్‌పై జాప్యం ఏర్పడింది. గత జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి రెండో తేదీన సర్పంచ్‌లకు పదవీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే చెక్‌ పవర్‌ను కల్పించాల్సి ఉన్నా తీవ్ర కాలయాపన చేసిందనే విమర్శలను ప్రభుత్వం మూటగట్టుకుంది. చెక్‌ పవర్‌ విషయంలో జాప్యం చేయడంపై సర్పంచ్‌లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు సర్పంచ్‌లు భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఎట్టకేలకు చెక్‌ పవర్‌ను కల్పిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలోని 530 గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ లభించనుంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు కూడా ఇదే విధానం వర్తించనుంది.

కొత్త చట్టంతో ఉప సర్పంచ్‌లకు.. 
గతంలో సర్పంచ్‌లకే చెక్‌ పవర్‌ ఉండేది. కేంద్రం ఇచ్చే నిధుల వినియోగం కోసం ఎంపిక చేసిన వార్డు సభ్యుడితో జాయింట్‌ చెక్‌ పవర్‌ విధానం అమలైంది. అయితే సర్పంచ్‌ ఒక్కరికే చెక్‌ పవర్‌ ఉండటంతో పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సర్పంచ్‌లకు, కార్యదర్శులకు కలిపి జాయింట్‌ చెక్‌ పవర్‌ను కల్పించింది. అయితే, ప్రభుత్వం 2018లో నూతన పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చింది. సర్పంచ్, కార్యదర్శి జాయింట్‌ చెక్‌ పవర్‌ విధానానికి స్వస్తి పలుకుతూ, సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌లకు ఈ అధికారం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు సంబంధించి అన్ని రకాల నిధులను వినియోగించడానికి ప్రభుత్వం ఇరువురికి అధికారం అప్పగించింది. అయితే, నిధుల వినియోగం ఆడిట్‌కు సంబంధించిన బాధ్యత మాత్రం సర్పంచ్, కార్యదర్శులకు ఉంది. దీంతో ఉప సర్పంచ్‌ కేవలం జాయింట్‌ చెక్‌ పవర్‌కు మాత్రమే అర్హత లభించినట్లయింది. నిధుల వినియోగం, అందుకు సంబంధించిన లెక్కల బాధ్యత అంతా సర్పంచ్, కార్యదర్శులే మోయాల్సి ఉంది.
 
ఉప సర్పంచ్‌ల్లో ఆనందం.. 
కొత్త పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉంటుందని ప్రభుత్వం అప్పట్లోనే జీవో జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధం లేకుండానే ఉప సర్పంచ్‌ పదవి దక్కించుకోవచ్చని వార్డు సభ్యుల్లో ఉత్సాహం నిండింది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేసి పదవిని దక్కించుకున్నారు. కానీ చెక్‌ పవర్‌ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయక పోవటంతో వారు ఆందోళన చెందారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను ఇస్తున్నారని లీకులు రావటంతో ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు ఆశలు వదులుకున్నారు. అయితే, కొత్త పంచాయతీ చట్టం ప్రకారమే ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌ రావడంతో వారిలో ఆనందం వెల్లి విరుస్తోంది.

మొండికేస్తే తొలగించే అధికారం.. 
నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌తో పాటు చెక్‌ పవర్‌ ఉన్న ఉప సర్పంచ్‌లు.. చెక్కులపై సంతకాలు చేయడానికి మొండికేస్తే ఉప సర్పంచ్‌ జాయింట్‌ చెక్‌ పవర్‌ను తొలగించే అధికారం జిల్లా పంచాయతీ అధికారులకు ఉంది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను కల్పించింది. అయితే, అనేక చోట్ల సర్పంచ్‌లతో ఉప సర్పంచ్‌లు సమన్వయంతో పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిధుల వినియోగంపై తీర్మానం చేసినా చెక్‌లపై సంతకాలు చేయడానికి ఉప సర్పంచ్‌లు నిరాకరిస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి డీపీవోకు నివేదిక పంపాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు చేయడానికి సహకరించక పోతే వారి చెక్‌ పవర్‌ను తొలగించి కార్యదర్శికే ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

సర్కారు తాజా మార్గదర్శకాలు ఇవి.. 

  • పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు సర్పంచ్, ఉపసర్పంచ్‌ బ్యాంక్‌ చెక్కులపై సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యాలయం నుంచి ఏమైన ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రం సర్పంచ్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. 
  • ఆడిట్‌ బాధ్యతలను సర్పంచ్, కార్యదర్శులకు అప్పగింత. గ్రామసభ నిర్వహణ, పంచాయతీ నిధుల వినియోగంపై సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పాటు గ్రామ కార్యదర్శిని భాగస్వామ్యం చేశారు. 
  • పంచాయతీల్లోని ప్రతి పని ఆన్‌లైన్‌ ద్వారా అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణ అనుమతులు, లే అవుట్‌ అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులను జారీ చేసింది. 
  • గ్రామసభలు, పంచాయతీ సమావేశాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి మూడు రోజుల్లో ఈవోపీఆర్డీకి పంపించాలి. పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానాలను కార్యాలయంలోని నోటీస్‌ బోర్డుపై ఉంచాలి. వాటిని పంచాయతీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 
  • కార్యదర్శికి అప్పగించిన బాధ్యతలను అమలు చేస్తూ, వాటిని పై అధికారులకు అందించాల్సి ఉంటుంది. అట్టి నివేదికల్లో ఏమైన పొరపాట్లు జరిగినట్లు తేలితే కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. 
  • గ్రామసభ నిర్వహించేందుకు నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామసభ నిర్వహిస్తే అట్టి గ్రామ పంచాయతీ జనాభాకు అనుగుణంగా ప్రజలు హాజరుకావాల్సి ఉంటుంది. 500 ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలంటే కనీసం 50 మంది హాజరుకావాలి. ప్రజలు హాజరు కాని ఎడల గ్రామసభను వాయిదా వేసి, మరో రోజు నిర్వహించాలి. గ్రామసభకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీయించి వెబ్‌సైట్‌లో ఉంచాలి. 
  • పంచాయతీ విధులను నిర్వహించే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారిని కలెక్టర్‌ ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేసే అధికారం ఉంది.  
  •  పంచాయతీ పాలన సక్రమంగా నిర్వహించేందుకు పాలకవర్గం సభ్యులు కట్టుబడి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

పాలనకు గ్రీన్‌ సిగ్నల్‌.. 
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం ప్రకారం చెక్‌ పవర్‌ అమలు చేస్తుండటంతో గ్రామ పాలనకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లయింది. పంచాయతీ పాలకులు ఎన్నికై నాలుగున్నర నెలలకైనా చెక్‌ పవర్‌ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం. ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పాలన అందిస్తాం. – ఆర్మూర్‌ పెద్ద బాల్‌రాజ్, సర్పంచ్‌ 
ఆనందంగా ఉంది.. 
కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌లో భాగస్వామ్యం కల్పించటం ఆనందంగా ఉంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ అందిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్‌ జారీ చేయటం మంచి పరిణామం. ఇద్దరికి కలిపి చెక్‌ పవర్‌ ఇస్తేనే గ్రామం త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది. – నూకల రమేశ్, ఉప సర్పంచ్, దుబ్బాక 

మరిన్ని వార్తలు