గొర్రెల రీసైక్లింగ్‌

27 Aug, 2018 12:53 IST|Sakshi

గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి సబ్సిడీపై పంపిణీ చేసే గొర్రెల కొనుగోలు పథకం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాల వ్యవహారం సద్దుమణగకముందే మరో బాగోతానికి తెరలేసింది. నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్రలో కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్న గొర్రెలబాగోతం మూడు రోజుల క్రితం కోరుట్ల మండలం మోహన్‌రావుపేట రోడ్డు ప్రమాదంతో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన సుమారు వెయ్యి సబ్సిడీ గొర్రెలను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా.. ఆదిలాబాద్‌ జిల్లా రాంపూర్‌ వద్ద రవాణాశాఖ అధికారులు శుక్రవారం పట్టుకోవడంతో ‘రీసైక్లింగ్‌’ బాగోతం బట్టబయలైంది. గొర్రెల కొనుగోలు పథకంలో పెద్ద ఎత్తున నిధులు గోల్‌మాల్‌ కాగా.. పథకం అమలులో ఇప్పటివరకు రూ.7కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సంబంధిత శాఖలోనే చర్చ జరుగుతోంది.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గొర్రెల పంపిణీ పథకం పేరిట అటు నుంచి ఇటు (మహారాష్ట్ర నుంచి కరీంనగర్‌), ఇటు నుంచి అటు (కరీంనగర్‌ జిల్లా నుంచి మహారాష్ట్ర) తరలుతున్న గొర్రెల రవాణా, రీసైక్లింగ్‌లో రూ.లక్షలాదిగా దుర్వినియోగం అవుతున్నట్లు వెల్లడవుతోంది. అ అక్రమాలపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కొనుగోళ్లు, రీసైక్లింగ్‌ దందా ప్రభుత్వాన్ని, నిఘా విభాగాలను సవాల్‌ చేస్తున్నాయి.

కరీంనగర్‌టు మహారాష్ట్ర.. ఆదిలాబాద్‌ ఘటనతో బట్టబయలు
కరీంనగర్‌ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్న సబ్సిడీ గొర్రెల బాగోతం శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా రాంపూర్‌లో పట్టుబడటంతో బట్టబయలైంది. రెండు టారస్, రెండు ఐచర్‌ వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్న రవాణా శాఖ అధికారులు, పోలీసులు మొత్తం వెయ్యి గొర్రెలు ఉన్నట్లు తేల్చారు. ఇవన్నీ కరీంనగర్‌ జిల్లా నుంచే తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో ‘రీసైక్లింగ్‌’ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.

టారస్, ఐచర్‌ (పెద్ద లారీలు) వాహనాల్లో కింద, పైన, మధ్యలో చెక్కలను స్లాబ్‌గా వేసి ఈ గొర్రెలను తరలిస్తున్నారు. ఒక్కో టారస్‌ వాహనంలో 300 గొర్రెల చొప్పున రెండు టారస్‌ వాహనాలు, రెండు ఐచర్‌ వాహనాల్లో మొత్తం వెయ్యి గొర్రెలను సరిహద్దు దాటిస్తుండగా జాతీయ రహదారిపై పట్టుకోవడం గమనార్హం. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలుగా అనుమానించిన ఆర్టీఏ అధికారులు అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీసులకు అప్పగించడంతో విచారణలో గుట్టంతా రట్టయ్యింది.

‘మాఫియా’గా మారిన కొందరు దళారులు కరీంనగర్‌ జిల్లా గంగాధర కేంద్రంగా సబ్సిడీ గొర్రెలను సేకరించి.. అక్కడినుంచి నాలుగు భారీ లారీల్లో తరలిస్తున్నట్లు తేలింది. ఇదంతా పక్కా సమాచారం మేరకు దాడి చేసి రాంపూర్‌ సమీపంలో జాతీయ రహదారి44పై పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించడంతో సబ్సిడీ గొర్రెలు అక్రమంగా తరలుతున్న వ్యవహారం బయటపడింది. కొంతమంది దళారులు మహారాష్ట్రలో కొనుగోలు చేసిన వాటిని చెవులకు వేసిన ట్యాగ్‌ను తొలగించి రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు వెల్లడైంది. అక్రమంగా తరలిస్తున్న ఈ గొర్రె యూనిట్ల విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
 
‘మాఫియా’గా దళారులు.. భారీగా రీసైక్లింగ్‌
జిల్లా వ్యాప్తంగా తొలివిడతగా 2017–18 సంవత్సరానికి గాను 13,519 వేల యూనిట్లు (ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు ఒక పొట్టేలు) పంపిణీ చేయాలని లక్ష్యం విధించారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.1.25లక్షలు కాగా లబ్ధిదారుడు రూ.31,250 డీడీ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం రూ.93,750 సబ్సిడీ ఇస్తుంది. రూ.1.25 లక్షల సబ్సిడీలో రూ.1.11 లక్షలు గొర్రెలకు, రూ.6300 ట్రాన్స్‌పోర్టు, రూ.420 మందులు, రూ.3,800 బీమా, దాణాకు రూ.3,440 కేటాయించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 12,269 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు. ఇటీవల దాణా పంపిణీ కోసం పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లపై సర్వే చేయగా.. జిల్లావ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ గొర్రెలు మాయమైనట్లు తేలిందని పశువైద్యశాఖ అధికారులే చెబుతున్నారు.

ఇందుకు బినామీ లబ్ధిదారులు ఒక కారణమైతే.. బినామీలను సృష్టించడంలో కొందరు పశువైద్యాధికారులే కీలకపాత్ర వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ అధికారి గొల్లకుర్మ సంఘం కీలక నేతలతో మిలాఖత్‌ అయి ఇతరుల పేరు మీద రూ.31,250 డీడీ తీసి మహారాష్ట్రలో గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడా గొర్రెలు చూపించే బ్రోకర్ల వ్యవస్థతో డీలింగ్‌ పెట్టుకున్నారు. కొనుగోలు చేసి.. ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేసి.. లారీ ఎక్కించిన అనంతరం 20 నిమిషాల్లోపు లారీల నుంచి వాటిని తిరిగి అప్పగించారు. డాక్టర్లు, బ్రోకర్లు, అమ్మిన వ్యక్తి మధ్యే ఈ ఒప్పందం జరిగింది.

ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము అమ్మిన వ్యక్తి పేరు మీద అతని బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది బ్రోకర్‌ ఆ సొమ్ములో నుంచి అమ్మిన వ్యక్తి నుంచి అధికారుల వరకు వాటాలు పంపిణీ చేయడమనేది అవినీతి ఒప్పందం. అర్హులైన లబ్ధిదారుల విషయంలో ఒక్కో యూనిట్‌కు రూ.10 వేలు మండల డాక్టర్‌కు.. రూ.2 వేలు చక్రం తిప్పే అధికారికి అప్పగించారు. ఇక్కడే రీసైక్లింగ్‌కు బీజం పడినట్లు తాజాగా శుక్రవారం ఆదిలాబాద్‌లో పట్టుబడిన వెయ్యి సబ్సిడీ గొర్రెల వ్యవహారం ద్వారా అర్థమవుతోంది. గొర్రెల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు