నిబంధనలు పాటించని కళాశాలల మూసివేతలు

13 Sep, 2019 11:56 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొటున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలల పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేక, అధ్యాపకులు రాక నిర్వహణ భారమై మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. కాస్త ఆర్థికంగా ఉన్న వారు హైదరాబాద్, ఇతర పట్టణాలకు పంపించి ఇంటర్‌ విద్య చదివిస్తున్నారు. 

పెరిగిన అడ్మిషన్లు  
ప్రైవేటు కళాశాలల్లో పేదలు, సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వం సర్కారు కళాశాలలకు మళ్లించడంలో విజయవంతం అయిందనే చెప్పాలి. ఇది శుభ పరిణామం కూడా. కేవలం ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ప్రభుత్వ కళాశాలల్లో దాదాపు 3,300 అడ్మిషన్లు గత సంవత్సరం కంటే పెరిగాయి. అయితే గత సంవత్సరం కళాశాలలను సరిగ్గా నిర్వహించలేదని, పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేవని గమనించిన అధికారులు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో కలిపి మొత్తం 5 ప్రైవేటు కళాశాలలు అఫ్లియేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నా ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతిని నిరాకరించారు.

ఉమ్మడి జిల్లాలో ఈ సంఖ్య పదుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రతి సంవత్సరానికి ఒక సారి అఫ్లియేషన్‌ కోసం కళాశాలలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు చేసుకున్న చాలా కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇంకా మంజూరు చేయలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతా, ప్రమానాలు పాటించే కళాశాలలకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.   

37 కళాశాలలకు పెండింగ్‌.. 
జిల్లాలోని 37 ప్రైవేటు కళాశాలలకు ఇప్పటికి ప్రభుత్వ అఫ్లియేషన్‌ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 109 ప్రైవేటు కళాశాలలు ఉంటే ఇప్పటివరకు అనుమతి ఇచ్చింది 72 కళాశాలలకు మాత్రమే. గద్వాల్‌లో 6 కళాశాలలు, వనపర్తిలో 13 కళాశాలలు, నాగర్‌కర్నూల్‌ 14 కళాశాలలు, మహబూబ్‌నగర్, నారాయణపేట కలిపి మొత్తం 39 కళాశాలలకు మాత్రమే అఫ్లియేషన్‌ ఇచ్చింది. ఇక నిబంధనల ప్రకారం గత సంవత్సరం కళాశాలలను నిర్వహించని కళాశాలలను అఫ్లియేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న, వాటికి కనీసం అడ్మిషన్లు కూడా ప్రభుత్వం అనుమతి  ఇవ్వలేదు.

ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శ జూనియర్‌ కళాళాల, భవిత, న్యూఎరా, మక్తల్‌లో సాయి చైతన్య, మద్దూర్‌లో వివేకానంద జూనియర్‌ కళాశాలలను ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా అఫ్లియేషన్‌ ఇవ్వని 37 కళాశాలల్లో కూడా కొన్ని కళాశాలలు మాత్రమే పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహిస్తున్నారని, చాలా కళాశాలలో ప్రభుత్వ నిభంధనల ప్రకారం నిర్వహించడం లేదని అధికారులు అంటున్నారు. గద్వాల జిల్లాలో చాలా జూనయర్‌ కళాశాలలు రేకుల షెడ్డుల్లో నిర్వహిస్తున్నారని, వాటిని అనుమతి వచ్చే అవకాశం లేదని తెలస్తుంది.   

ఇవీ నిబంధనలు.. 
కళాశాలలకు అనుమతి ఉండాలంటే ముఖ్యంగా ఆర్సీసీసీ బిల్డింగ్‌ సొంతమా లేక, అద్దె భవనమా అని చూసి కళాశాలకు తరగతులకు నాలుగు సెక్షన్‌ల వరకు అనుమతి ఉంటుంది. ఇక ప్లే గ్రౌండ్‌ విషయంలో మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఒక ఎకరా భూమిని, అర్బన్‌ ప్రాంతంలో ఉంటే 2.5 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి చూపించాలి. ఇక పారిశుద్ధ్య విషయంలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, వాష్‌బేసిన్లు, శుద్ధజలం వంటి వాటికి ముఖ్యమైనవి. స్ట్రక్షర్‌ సౌండ్‌ ఎఫెక్ట్‌కు సంబంధించి ఆర్‌అండ్‌బీ నుంచి అనుమతి, ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎఫ్‌ఆర్‌డీ నుంచి అనుమతి తీసుకోవాలి.

తరగతుల వారిగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఇక ల్యాబరోటరీలు, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ వేరువేరుగా ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక లైబ్రరీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉండాలి. అధ్యాపకుడి పూర్తి వివరాలు, ఒరిజినల్‌ సర్టికెట్లను ఆన్‌లైన్‌ పద్ధతిలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆ శాఖల నుంచి అనుమతి పత్రాలను ప్రభుత్వానికి ఒరిజినల్‌వి పంపాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉంటే అప్పుడు బోర్డు అధికారులు తనిఖీలకు వెళ్లి అనుమతిని ధ్రువీకరిస్తారు.   

ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు  
ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా  ఎక్కువ మొత్తంలో విద్యార్థులను ప్రభుత్వ కళాశాలోల్లో చేర్పించేందుకు కృషి చేస్తోంది. ఇటీవల కస్తూర్బా గాంధీ కళాశాలల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున 22 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ప్రారంభించడంతో విద్యార్థులు అక్కడ అడ్మిషన్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

అంతేకాకుండా ఎటువం టి ఫీజులు లేకుండా పుస్తకాలు, వసతి, యూనిఫాం లతో పాటు నాణ్యమైన విద్య అందించడం తో అటువైపు చాలా మంది విద్యార్థులు వెళ్తున్నా రు. వీటితో పాటు ఇంటర్‌ జూనియర్‌ కళాశాల ల్లో కూడా పూర్తిగా ఉచిత విద్యను అందించడం తో విద్యార్థులు అక్కడే ఆసక్తి చూపుతున్నారు. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే దాదాపు 3,300 అడ్మిషన్లు గతంలో కంటే పెరిగాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఈ కారణాలతో ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు కరువయ్యాయి.

నిబంధనలు పాటిస్తేనే అనుమతి   
జిల్లాలో అఫ్లియేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న కళా శాలలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే అనుమతి లభిస్తుంది. నిబంధనలు ఖాతరు చేయని కళాశాలలకు అడ్మిషన్లు నిలిపివేశాం. అప్లియేషన్‌ రాని కళాశాలలు పూర్తి స్థాయిలో అన్ని వివరాలను సకాలంలో సమర్పిస్తేనే అనుమతి ఇస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించడం వల్ల చాలా వరకు అక్కడ అడ్మిషన్లు పెరిగాయి.           
 – వెంక్యానాయక్,  ఇంటర్మీడియెట్‌ అధికారి  

మరిన్ని వార్తలు