నిర్ణయానికి మరికొంత సమయం

23 Jul, 2020 04:19 IST|Sakshi

ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టుకు సర్కార్‌ నివేదన 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులపై విధాననిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు స్కూల్స్‌ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంపై హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసో సియేషన్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం  విచారించింది. ఆన్‌లైన్‌క్లాసులపై ప్రభుత్వం  నిర్ణయం తీసుకుందా? ఎప్పటి నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభి స్తారు? అని ధర్మాసనం ప్రభు త్వ న్యాయవాదిని ప్రశ్నించింది. రోజూ 4 నుంచి 5 గంటల పాటు ఆన్‌లైన్‌లో తరగతులు  విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం కేంద్రం ఈ నెల 14న 46 మార్గదర్శకాలను జారీ చేసిందని, ఈ మేరకు ఎన్‌సీఆర్‌టీ మార్గదర్శకాలను రూపొందిస్తోందన్నారు. వీటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తయారు చేసుకోవాలని, అప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభంపై స్పష్టత వస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు