సంక్షేమంలో సర్దుపాట్లు..

17 Nov, 2019 06:14 IST|Sakshi

మాంద్యం ఎఫెక్ట్‌..

ఖర్చుల తగ్గింపుపై ప్రభుత్వం సూచనలు

ఎక్కువ ఖాతాల్లో నగదు నిల్వలు వద్దు

నిల్వలపై నివేదికలివ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా ఖర్చులు తగ్గించుకుంటూ ప్రాధాన్యత కార్యక్రమాలకు అనుగుణం గా నిధులు వెచ్చించాలని సూచిస్తోంది. ఈ మేరకు సంక్షేమ శాఖలు, అనుబంధ విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు పంపింది. ఇటీవల సంక్షేమ శాఖ ల వారీగా ఆర్థిక శాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో 2019–20 బడ్జెట్‌ కేటాయింపులపై చర్చించడంతోపాటు సంక్షేమ శాఖల వారీగా అవసరాలను ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే శాఖల వినతులను పరిశీలిస్తూనే.. నిధుల సర్దుబాటుపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

ట్రెజరీ ద్వారా చెల్లింపుల ప్రక్రియ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుండగా.. ప్రభుత్వ శాఖలే నేరుగా చెల్లించే అంశాలపై పలు రకాల మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. సంక్షేమ శాఖ సంచాలక కార్యాలయాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఖజానా శాఖకు అనుసంధానం కాగా.. కార్పొరేషన్లు, సొసైటీలు, ఫెడరేషన్లకు సంబంధించి మాత్రం నేరుగా చెల్లింపులు చేసే వీలుంది. ఇందుకు ఆయా శాఖలకు పీడీ ఖాతాలతోపాటు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, వాటిపై వచ్చే వడ్డీని వినియోగించుకునే అధికారం ఉంది. ప్రభుత్వ అనుమతితోనే ఇవన్నీ నిర్వహించినప్పటికీ.. నిధుల వినియోగంలో స్వతంత్రత ఉంటుంది. తాజాగా వాటికి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల ని ప్రభుత్వం పరోక్ష ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

బ్యాంకు ఖాతాల్లో నిల్వలెన్ని... 
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు సంబంధించి కార్పొరేషన్లు, సొసైటీలకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలుంటాయి. డిపాజిట్లు చేసేందుకు కూడా ప్రత్యేక ఖాతా లుంటాయి. వీటితో పాటు ఇంజనీరింగ్‌ విభాగాలున్న శాఖలకు వేరుగా పీడీ ఖాతాలుంటాయి. కొన్ని శాఖలకు రెండు, అంతకంటే ఎక్కువ ఖాతాలు న్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఖాతాల్లో నిల్వలపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

ఆచితూచి ఖర్చు చేయండి 
వ్యయ కుదింపు చర్యలపైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ప్రాధాన్యత అంశాలకే ఖర్చులు చేయాలని, నిర్మాణ పనులు వద్దని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలల్లో, వసతి గృహాల్లో, ఇతర విద్యాసంస్థల్లో మరమ్మతు పనులను జాగ్రత్తగా చేయాలని, అత్యవసరమైన వాటికే ఖర్చు లు చేయాలని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు ప్రతిపాదనలు సమర్పించగా.. సున్నితంగా తిరస్కరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు