టెస్టులిక ర్యాపిడ్‌

11 Jul, 2020 03:22 IST|Sakshi

రోజుకు 15 వేల పరీక్షలకు సర్కారు ఏర్పాట్లు

అందులో 5 వేలు ఆర్‌టీపీసీఆర్, 10 వేలు ర్యాపిడ్‌ టెస్టులు

యాంటిజెన్‌ పరీక్షలకు 2 లక్షల కిట్లు తెప్పించిన సర్కారు

లక్షణాలున్న వారందరికీ చేయాలని నిర్ణయం

కేసుల పెరుగుదలతో కదిలిన వైద్య, ఆరోగ్యశాఖ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కరాళనృత్యంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం కదిలింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ టంతో వేగంగా కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలని, తద్వారా కరోనాను కట్టడి చేయాలని నిర్ణయిం చింది. అందుకోసం వచ్చే 20 రోజుల్లో దాదాపు 3 లక్షల కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయాలని అత్యంత కీలక నిర్ణ యం తీసుకుంది. ఆ ప్రకారం రోజుకు 15 వేల పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న ఆర్టీ–పీసీఆర్‌ టెస్టు ద్వారా రోజుకు 5 వేలు, తాజాగా ప్రారంభిం చిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ద్వారా రోజుకు 10 వేల కరోనా పరీ క్షలు చేయాలని నిర్ణయించినట్లు కరోనా నియంత్రణ ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. అత్యధికంగా యాంటిజెన్‌ ద్వారానే వేగంగా పరీక్షలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

2 లక్షల యాంటిజెన్‌ కిట్లు..
మొదట కేవలం 50 వేల యాంటిజెన్‌ కిట్లు మాత్రమే తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం, కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మరో లక్షన్నర కిట్లను తెప్పించింది. యాంటిజెన్‌ కిట్ల ద్వారానే వేగంగా లక్షణాలున్నవారిని  గుర్తించాలనేది సర్కారు ఆలోచన. ఇప్పటికే కేసుల సంఖ్య 30 వేలు దాటడం, ప్రతీ రోజూ దాదాపు 1,500 నుంచి 2 వేల మధ్య కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని సర్కారు అప్రమత్తమైంది. అంతే వేగంగా వైరస్‌ను పసిగట్టలేకపోతే మరింత ప్రమాదం పొంచి ఉందని గుర్తించింది. 20 రోజుల్లో 3 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాక, అప్పటికీ డిమాండ్‌ను బట్టి, వైరస్‌ తీవ్రతను బట్టి మరో 2 లక్షల యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లను తెప్పించాలని యోచిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మున్ముందు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలను తక్కువ చేసి, యాంటిజెన్‌ పరీక్షలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

లక్షణాలున్న వారందరికీ పరీక్షలు...
రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలున్నవారందరికీ యాంటిజెన్‌ పద్దతిలోనే ర్యాపిడ్‌ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రజల ముంగిటకు వెళ్లి పరీక్షలు చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక జిల్లాల్లోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోనూ పరీక్షలు చేయాలని యోచిస్తున్నారు. యాంటిజెన్‌ పరీక్ష ద్వారా కేవలం 15 నుంచి 30 నిమిషాల మధ్యే ఫలితం రానుంది. అంతేకాదు నమూనా ఇచ్చిన వెంటనే ఆ వ్యక్తిని అక్కడే ఉంచి ఫలితం 30 నిమిషాలలోపే చెప్పి పంపిస్తారు.

పాజిటివ్‌ ఉండి, తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి రిఫర్‌ చేస్తారు. ఆ ప్రకారమే ప్రణాళిక రచించారు. ఉదాహరణకు ఒక ఆరోగ్య కేంద్రంలో 10 మంది నమూనాలు ఒకేసారి తీసుకున్నాక, వాటిని పరీక్షిస్తారు. ఆ ఫలితం ప్రకటించాక మరో పది మందికి చేస్తారు. ఇలా రోజుకు 10 వేల వరకు యాంటిజెన్‌ పరీక్షలు చేసి, వారందరి ఫలితాలు అప్పటికప్పుడు వెల్లడిస్తారు. అయితే యాంటిజెన్‌ పరీక్షలో నెగిటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతమే కాబట్టి, వారికి ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తారు.

అయితే యాంటిజెన్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినవారికి రెండు మూడు రోజులు వేచి చూశాక, లక్షణాల తీవ్రతను బట్టి మాత్రమే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్న ప్రైవేటు లేబరేటరీలు కూడా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసుకోవచ్చని, దానికి ప్రత్యేక అనుమతి అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. దాని ఫీజు రూ. 500 నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు