‘క్రమబద్ధీకరణ’ అర్జీలకు మోక్షం!

14 Nov, 2014 03:37 IST|Sakshi
‘క్రమబద్ధీకరణ’ అర్జీలకు మోక్షం!

త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
పెండింగ్‌లో 6726 బీపీఎస్, 5165 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు
ఇక దరఖాస్తుల స్వీకరణ లేనట్లే!
 
సాక్షి, హైదరాబాద్: అక్రమ భవన నిర్మాణాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కని పిస్తోంది. అలాగే ఇక క్రమబద్ధీకరణ కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించరాదని భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఉడాలను మినహాయిస్తే.. తెలంగాణలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న 6,726 బీపీఎస్ దరఖాస్తులు, 5,165 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో వాటిపై నిర్ణయం తీసుకోవాలంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సీఎం కార్యాలయాన్ని కోరింది.
 
 భవన నిర్మాణంలో ప్లాన్ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులైరె జ్ చేసేందుకు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) ప్రవేశపెట్టుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2007 డిసెంబర్ 31న జీవో నెం.901 జారీ చేసింది. అప్పుడు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంచిన 6,726 దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే 2008లోనూ అసమగ్ర వివరాలు, ఇతర కారణాలతో 5,165 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా పురపాలక సంస్థలకు రూ.112.57 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పెండింగ్ దరఖాస్తులపై సీఎం పేషీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది.

మరిన్ని వార్తలు