రాష్ట్రపతికి గవర్నర్‌ విందు

23 Dec, 2019 03:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గౌరవార్థం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. విందుకు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్‌ దంపతులకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ రాజ్‌భవన్‌ ప్రవేశద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి దంపతులు విందుకు హాజరైన అతిథులందరి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. తన ఆహా్వనాన్ని మన్నించి విచ్చేసిన రాష్ట్రపతికి గవర్నర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ యాప్‌ ఆవిష్కరణ:  తెలంగాణ రెడ్‌క్రాస్‌ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) మొబైల్‌ యాప్‌ను ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఆవిష్కరించారు.

ఈ యాప్‌ను ఏ భాషలోనైనా వినియోగించవచ్చని, ఏ రాష్ట్రమైనా అడాప్ట్‌ చేసుకోవచ్చని గవర్నర్‌ తెలిపారు. ఈ యాప్‌ విశేషాలను రాజ్‌భవన్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ వివరించారు. సభ్యత్వం కోసం రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ వివరాలను నమోదు చేస్తే సొసైటీ సభ్యత్వం లభిస్తుందని చెప్పారు. యాప్‌ నుంచే డిజిటల్‌ సంతకం చేసిన సభ్యత్వ ధ్రువీకరణ పత్రం పొందవచ్చని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సమీపంలో ఉన్న రక్త నిధి కేంద్రాల వివరాలు, చిరునామా, ఫోన్‌ నంబర్, గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ తదితర వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. విందు ముగిసిన అనంతరం రాష్ట్రపతి కోవింద్‌ దంపతులకు తమిళిసై, కేసీఆర్‌లు రాజ్‌భవన్‌ నుంచి వీడ్కోలు పలికారు.

ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏర్పాటు చేసిన విందుకు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్‌ దంపతులు, 
ముఖ్యమంత్రి కేసీఆర్,  హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ 

మరిన్ని వార్తలు