గవర్నర్‌.. మెట్రో జర్నీ

16 Jul, 2018 02:06 IST|Sakshi

ప్రొటోకాల్, భద్రతాఏర్పాట్లు లేకుండా ప్రయాణం 

విషయం తెలిసి హడావుడిగా స్టేషన్‌కు చేరుకున్న ఎన్వీఎస్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మెట్రోరైలులో సాధారణ ప్రయాణికుడిలా జర్నీ చేసి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆదర్శంగా నిలిచారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సతీసమేతంగా నగర మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌కు సాధారణ ప్రయాణికుడిలా భార్యతో కలసి వచ్చిన ఆయన అమీర్‌పేట్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో దిగి మరో రైలులో మియాపూర్‌ వరకు(కారిడార్‌–1) వెళ్లారు. ఆయన రాకను గుర్తించిన మెట్రో అధికారులు హైదరాబాద్‌ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్‌) ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే మియాపూర్‌ మెట్రోస్టేషన్‌కు పరుగున వచ్చి గవర్నర్‌ దంపతులకు సాదర స్వాగతం పలికారు.

మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించిన వసతులను చూపారు. తన పర్యటన సందర్భంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని గవర్నర్‌ ఆదేశించడం గమనార్హం. మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఆర్ట్‌ సెంటర్, ఇనాగరల్‌ ప్లాజా, వాటర్‌లెస్‌ యూరినల్స్, ప్రజోపయోగ స్థలాలను గవర్నర్‌ దంపతులు పరిశీలించారు. స్టేషన్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రజోపయోగ స్థలాలు, అభివృద్ధి పనులను చూసి ముగ్ధులైన గవర్నర్‌ దంపతులు హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు ఓ మణిహారం అని, జీవించేందుకు అత్యంత అనువైన నగరమే కాదు, పీపుల్‌ ఫ్రెండ్లీ సిటీకి హైదరాబాద్‌ నిదర్శనంగా నిలుస్తోందని కొనియాడారు. మాస్కో తరహాలో మెట్రో స్టేషన్లను ఆర్ట్‌ మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని ఎన్వీఎస్‌రెడ్డికి సూచించారు. 

మరిన్ని వార్తలు