సచివాలయం కూల్చివేత

8 Jul, 2020 03:22 IST|Sakshi

మంగళవారం తెల్లవారుజాము నుంచే షురూ

భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత

ఇప్పటికే సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు రాతిభవనం నేలమట్టం

సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు

మరో మూడు రోజుల్లో కూల్చివేత పూర్తి..

శిథిలాల తొలగింపునకు కొన్ని వారాలు

కూల్చివేతకు సాంప్రదాయ పద్ధతికే మొగ్గు చూపిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సచి వాలయ భవనాలను కూల్చివేసి అదే ప్రాంతంలో ఆధునిక హంగులతో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేస్తూ జూన్‌ 29న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన వారం రోజులకే  అకస్మాత్తుగా సచివాలయ భవనాల కూల్చివేతకు సర్కారు శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్‌ హెచ్, సౌత్‌ హెచ్‌ బ్లాకుల భవనాలు ఉండగా, మంగళవారం సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. 

మిగిలిన బ్లాకుల కూల్చివేత పనులూ సమాంతరంగా జరుగుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నడుస్తున్న బీఆర్కే భవన్‌లో ఉద్యోగులకు మంగళవారం సెలవు ఇచ్చారు. బిల్డింగ్‌ ఇంప్లోజియం పరిజ్ఞానంతో పేలుడు పదార్థాలు ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో పేలుళ్లు జరపడం ద్వారా సచివాలయం భవనాలను సులువుగా, సత్వరంగా కూల్చి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. పేలుళ్ల ప్రకంపనల ధాటికి పక్కనే నిండు కుండలాగా ఉండే హుస్సేన్‌సాగర్‌ కట్టకు ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశముందని భావించి దాన్ని ప్రభుత్వం విరమించుకుంది. పెద్ద మొత్తంలో దట్టమైన దుమ్ము ఎగిసిపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైతం ఇబ్బందిపడతారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

భారీ ప్రొక్‌లైనర్లు, క్రేన్లు, ఇతర యంత్రాలను వినియోగించి సాంప్రదాయ పద్ధతిలో కూల్చివేత పనులు నిర్వహిస్తున్నారు.  మరో నాలుగు రోజుల్లో భవనాలన్నీ పూర్తిగా నేలమట్టం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కూల్చివేత అనంతరం బయటపడనున్న టన్నుల కొద్దీ శిథిలాలను తరలించడనికి మాత్రం కొన్ని వారాల సమయం పట్టనుందని అంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఆకస్మాత్తుగా కూల్చివేతను ప్రారంభించడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. కూల్చివేత, శిథిలాల తరలింపు ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. 2019 జూన్‌ 29న కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ భూమిపూజ సైతం నిర్వహించారు. వచ్చే శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో ఆలోగా పనులు ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

కాలగర్భంలో చరిత్ర !
132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయ భవనాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పరిపాలన అవసరాల కోసం 6వ నిజాం నవాబు 1888లో సైఫాబాద్‌ ప్యాలెస్‌ను నిర్మించగా, కాలక్రమంలో అది రాష్ట్ర సచివాలయం జీ–బ్లాక్‌గా అవతరించింది. యూరోపియన్‌ ఆర్కిటెక్ట్‌ శైలితో నిర్మించిన సైఫాబాద్‌ ప్యాలెస్‌తో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు ముడిపడిఉన్నాయి. 6వ నిజాం 1888లో ఈ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు బల్లి అడ్డురావడంతో అపశకునంగా భావించి దీనికి తాళం వేసి ఉంచారు. అనంతరం 1940లో దీనిని తెరిచారు. ఏ–బ్లాక్‌ను 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించారు. సీ–బ్లాక్‌ ను 1978 లో ఆనాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. 

దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. ప్రగతిభవన్‌ నిర్మాణానికి ముందు సీఎం కేసీఆర్‌ సైతం కొంతకాలం పాటు సీ–బ్లాక్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఏ–బ్లాక్‌ రెండో విడతను 1998 ఆగస్టు 10న చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించారు. డీ–బ్లాకును 2003 లో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ప్రారంభించారు. మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న జే, ఎల్‌ బ్లాకులను 1990 నవంబర్‌ 12న అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి  ప్రారంభించారు. సచివాలయంలో అతిపెద్దది జే –బ్లాక్‌. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయంలో మొత్తం 10 బ్లాకులు ఉండగా, 132 ఏళ్లలో దశల వారీగా వీటి నిర్మాణం జరిగింది. కొత్తగా నిర్మించిన డీ–బ్లాక్‌ను 2003లో, నార్త్, సౌత్‌ హెచ్‌ బ్లాకులను 2013లో ప్రారంభించారు. 

దశాబ్దాల అనుబంధం ...
ఉమ్మడి ఏపీ, విభజన అనంతర ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏలిన 16 మంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన కేంద్రంగా 6 దశాబ్దాలుగా పైనే సేవలందించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి సచివాలయంగా ఉపయోగపడింది. ఎందరో సీఎంలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, సచివాలయం కేడర్‌ అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రిటైర్డు అధికారులకు దశాబ్దాల అనుబంధం ఈ భవనాలతో ఉంది. భవనాలను కూల్చివేస్తున్నారని తెలుసుకుని అందరూ సచివాలయ భవనాలతో తమ అనుబంధాన్ని సన్నిహితుల వద్ద నెమరవేసుకున్నారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలు... వాహనాల దారి మళ్లింపు
సచివాలయ భవనాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా నివారించేందుకు ప్రభుత్వం భారీగా పోలీసుల మోహరించింది. సచివాలయానికి వెళ్లే అన్నిదారులను మంగళవారం తెల్లవారుజామున నుంచే మూసివేసి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించింది. సచివాలయం వైపు వెళ్లేందుకు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఇటువైపు నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించింది. చివరకు మీడియా ప్రతినిధులు, వాహనాలకు సైతం అనుమతి నిరాకరించింది.  ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మింట్‌ కాంపౌండ్, రవీంద్రభారతి, హిమాయత్‌నగర్‌  నుంచి సచివాలయం వైపు వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. కూల్చివేతతో పాటు శిథిలాల తరలింపు పూర్తయ్యే వరకు ఈ దారులను మూసి ఉంచనున్నారని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. 

వాస్తు దోషమే ప్రధాన సమస్య    
ప్రస్తుత సచివాలయానికి చాలా వాస్తుదోషాలున్నాయని వాస్తుపండితులు సీఎం కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. ఆర్బీఐ నుంచి వచ్చే రహదారితో సచివాలయానికి వీధి పోటు ఉందని, అదే విధంగా 25 ఎకాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయం స్థల ఆకారం సైతం గజిబిజీగా ఉందని వాస్తు పండితులు పేర్కొనేవారు. చతురస్త్ర/దీర్ఘచతురస్త్ర ఆకారంలో స్థలం ఉంటేనే  వాస్తు ఉంటుందని, ఆ దిశగా కొత్త సచివాలయం కోసం పక్కనే ఉన్న ఇతర కార్యాలయాల భవనాల స్థలాలను సైతం సేకరించాలని వాస్తు పండితులు సీఎంకు సూచించారు. వాస్తు సలహాల కోసం సుద్దాల సుధాకర్‌ తేజను కన్సల్టెంట్‌గా సీఎం నియమించుకున్నారు. ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాలయంలో ఈయనకు ప్రత్యేకంగా ఒక చాంబర్‌ను సైతం కేటాయించారు. కొత్త భవనాల నిర్మాణం, డిజైన్ల తయారీ, ముహూర్తాల ఖరారు, శంకుస్థాపన స్థల నిర్ణయం వంటి అంశాల్లో సుధాకర్‌ తేజ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు