-

మళ్లీ కృష్ణా జలాల లెక్క తప్పింది!

5 Sep, 2018 01:16 IST|Sakshi

శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసిన నీటిలో 44 టీఎంసీల మేర లోటు 

లెక్క తేల్చాలని బోర్డుకు తెలంగాణ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నుంచి విడుదలైన కృష్ణా జలాల్లో మళ్లీ లెక్క తప్పింది. గత ఏడాది మాదిరి ఈసారి కూడా శ్రీశైలం నుంచి విడుదలైన నీటికి, నాగార్జునసాగర్‌కి చేరిన నీటికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఏకంగా లెక్కలోకి రాని జలాలు 44 టీఎంసీల మేర లోటు ఉండటంతో అవి ఎక్కడికి వెళ్లాయన్న దానిపై ఇప్పుడు అధికారులు తల పట్టుకుంటున్నారు. ఈ ఏడాది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు మొత్తం 193.49 టీఎంసీల నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేయగా, ఇందులో 149.52 టీఎంసీలు మాత్రమే నాగార్జున సాగర్‌కు చేరాయి. 43.97 టీఎంసీలు తక్కువగా వచ్చాయి. సాధారణంగా విడుదల చేసిన నీటికి, చేరే నీటిలో 10 శాతం వరకు తేడా ఉండొచ్చు. కానీ, ఇక్కడ ఏకంగా 23 శాతం తేడా వచ్చింది.

గత ఏడాది సైతం ఇదే తరహాలో 44 టీఎంసీలు తేడా వచ్చింది. దీనిపై అప్పట్లో కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. సెంట్రల్‌ వాటర్, పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)తో సర్వే చేయించాలని నిర్ణయించినా, అది అమల్లోకి రాలేదు. ఈసారి కూడా అదే పునరావృతం కావడంతో తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ మరోమారు బోర్డుకు లేఖ రాశారు. గత ఏడాది మాదిరి లెక్కలోకి రాని 44 టీఎంసీల అంశాన్ని తేల్చాలని కోరారు. జూలై 24 నుంచి ఆగస్టు 18 వరకు 51 టీఎంసీలు విడుదల చేస్తే 44.67 టీఎంసీల నీరు మాత్రమే సాగర్‌చేరాయని, అయితే, ఆగస్టు 19 నుంచి 27వరకు స్పిల్‌వే, పవర్‌ హౌస్‌ల ద్వారా 142.41 టీఎంసీలు విడుదల చేస్తే సాగర్‌కు కేవలం 104.84 టీఎంసీలు మాత్రమే చేరాయని తెలిపారు. ఇక్కడ ఏకంగా 26.38 శాతం తక్కువగా నీరొచ్చిందని, మొత్తంగా ఈ ఏడాదిలో 43.97 టీఎంసీలు నీరు లెక్కలోకి రాలేదని తెలిపారు. ఈ విషయంపై లెక్క తేల్చాలని కోరారు.

మరిన్ని వార్తలు