వానాకాలం పంటల చిత్రపటం సిద్ధం

29 May, 2020 02:32 IST|Sakshi

వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానశాఖల రూపకల్పన

95 వేలకు పైగా ఎకరాల్లో తగ్గనున్న వరి సాగు విస్తీర్ణం

పది లక్షల ఎకరాల్లో కొత్తగా పెరగనున్న పత్తి సాగు

భారీగా పెరగనున్న కంది..తగ్గనున్న సోయాబీన్‌ విస్తీర్ణం

మినుములు, పెసలు, వేరుశనగ, ఆముదం పంటలకు ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటల వారీగా సాగుచేయాల్సిన విస్తీర్ణాన్ని వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు ఖరారు చేశాయి. జిల్లాల వారీగా 2019 వానాకాలంలో పంటల వారీగా సాగు విస్తీర్ణం గణాంకాలను దృష్టిలో పెట్టుకుని 2020 వానాకాలా నికి సంబంధించి పంటల చిత్రపటం (క్రాప్‌ మ్యాపిం గ్‌)ను రూపొందించాయి. గతేడాది వానాకాలం, యాసంగి కలుపుకుని రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేయగా, కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో అదనంగా మరో 10లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో 2020 వానాకాలం, యాసంగి కలుపుకుని 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, పంటల వారీగా వానా కాలంలో సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేశారు.

సాగులో సం‘పత్తి’
తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండటంతో ఆ పంటసాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. గతేడాది రాష్ట్రంలో 53లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది 70లక్షల ఎకరాలకు పెంచాలని సీఎం ఆదేశించారు. దీంతో తాజాగా రూపొందించిన పంటల ప్రణాళిక మేరకు రాష్ట్రంలో అదనంగా 10.24లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేయాల్సి ఉంటుంది.

మక్క.. వద్దు పక్కా
పొరుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నలు తక్కువ ధరకే దొరుకుతుండటంతో రాష్ట్రంలో సాగవుతున్న మక్కలకు కనీస మద్దతుధర లభించట్లేదు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు రూ.1,760 చెల్లించి మక్కలను కొనుగోలు చేసింది. అయితే రాష్ట్రంలో 25లక్షల టన్నులకు మించి మక్కల వినియోగం లేకపోవడంతో వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయొద్దని సీఎం ఖరాకండీగా చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 10.11లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. ప్రస్తుతం రూపొందించిన పంటల చిత్రపటంలో ఈ పంటకు చోటు దక్కలేదు.

కంది.. సాగు దండి
గతేడాది రాష్ట్రంలో 7.38లక్షల ఎకరాల్లో కంది సాగైంది. పంటల చిత్రపటం రూపకల్పనలో భాగంగా మొక్కజొన్నకు బదులు కంది సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలో పప్పుధాన్యాల వినియోగం 11.7లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5.6 లక్షల టన్నుల పప్పుధాన్యాలు మాత్రమే దిగుబడి అవుతున్నాయి. ఈ లోటు భర్తీకి 6.1లక్షల టన్నుల మేర పప్పులను రాష్ట్రం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కందితో పాటు మినుములు, పెసలు సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచుతూ కార్యాచరణ ఖరారు చేశారు. క్రాప్‌ మ్యాపింగ్‌ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6.70లక్షల ఎకరాల్లో కంది, 45వేలకుపైగా ఎకరాల్లో పెసలు, 28వేల ఎకరాల్లో మినుములు సాగు చేయాల్సి ఉంటుంది.

వరి..సరిసరి
గతేడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 41.19లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ధాన్యాగారంగా మారింది. ఈ ఏడాది ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో సుమారు మూడోవంతు రాష్ట్రం నుంచి దిగుబడి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం జలాలు కూడా అందుబాటులోకి వస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి వసతి ఉన్నచోట కూడా పత్తి సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వరిసాగు విస్తీర్ణంలో భారీగా కోత పడనుంది. దీంతో పంటల చిత్రపటం ప్రకారం సుమారు 95వేలకుపైగా ఎకరాల్లో వరిసాగును తగ్గించాలని నిర్ణయించారు.

ఆముదం.. ప్రధానం
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆముదం నూనెలో భారత్‌ నుంచే 90శాతం వస్తుండగా, తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా ఉన్నాయి. దేశంలో గుజరాత్‌లోనే అత్యధికంగా 75శాతం మేర ఆముదం సాగు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఆముదం సాగుచేస్తుండగా, నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని నిర్ణయించారు. దీంతో కొత్తగా 73వేలకు పైగా ఎకరాల్లో ఆముదం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

వేరుశనగ బాగు.. సోయా తగ్గు
నూనె గింజలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వేరుశనగను కూడా 17వేలకు పైగా ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారు. ఆముదం, వేరుశనగ సాగు విస్తీర్ణాలను పెంచుతూనే సోయా సాగు విస్తీర్ణాన్ని 1.74లక్షల ఎకరాల మేర కుదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గతేడాది 4.28లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయగా, ప్రస్తుత వానాకాలంలో సుమారు 3లక్షల ఎకరాలకే పరిమితం కానుంది.

పసుపు, ఉల్లి కుదింపు.. జొన్న కాదిక మిన్న
గతేడాది 34వేల ఎకరాల్లో ఉల్లి సాగుచేయగా 3.40లక్షల మెట్రిక్‌ టన్నుల మేర దిగుబడి వచ్చింది. పంటల చిత్రపటం ప్రకారం ఈ ఏడాది వానాకాలంలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని 24వేల ఎకరాలకుపైగా తగ్గించాలని నిర్ణయించారు.

పసుపు 1.33లక్షల ఎకరాల్లో సాగు చేయగా 2.81లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. తాజా ప్రణాళికలో భాగంగా ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 8,700పైగా ఎకరాలకు కుదిస్తారు.

ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న జొన్న పంట విస్తీర్ణాన్ని మొత్తంగా 5వేల ఎకరాల మేర తగ్గించాలని పంటల చిత్రపటంలో పేర్కొన్నారు.

వరి సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
నల్లగొండ        3,30,000 ( ఎకరాలు)
సూర్యాపేట    3,20,000
నిజామాబాద్‌    3,00,000

పత్తి సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
నల్లగొండ             7,25,000(ఎకరాల్లో)
నాగర్‌కర్నూలు    4,50,000
ఆదిలాబాద్‌          4,35,088

కంది సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
వికారాబాద్‌           1,73,900 (ఎకరాల్లో)
నారాయణపేట    1,70,000
రంగారెడ్డి              1,00,000

సోయాబీన్‌ సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
నిర్మల్‌             60,000( ఎకరాల్లో)
కామారెడ్డి         50,000
సంగారెడ్డి        46,473

జొన్న సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
మహబూబ్‌నగర్‌    41,500(ఎకరాల్లో)
రంగారెడ్డి        22,000
నారాయణపేట    15,000

మినుములు సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
సంగారెడ్డి        22,000 (ఎకరాల్లో)
కామారెడ్డి        10,000
వికారాబాద్‌     9,500

ఆముదం సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
మహబూబ్‌నగర్‌    40,530(ఎకరాల్లో)
నారాయణపేట    36,000
వనపర్తి                25,050

వేరుశనగ సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
గద్వాల                   20,000 (ఎకరాల్లో)
వరంగల్‌ రూరల్‌    8,500
వనపర్తి                   4,500

చెరుకు సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
సంగారెడ్డి          34,200(ఎకరాల్లో)
కామారెడ్డి          12,061
వికారాబాద్‌         6,508

పెసలు సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
సంగారెడ్డి        48,000(ఎకరాల్లో)
ఖమ్మం            22,000
వికారాబాద్‌       20,800

పసుపు సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
నిజామాబాద్‌    37,350 (ఎకరాల్లో)
జగిత్యాల        32,240
నిర్మల్‌            20,050

ఉల్లి సాగు విస్తీర్ణంలో టాప్‌ జిల్లాలు
గద్వాల        7,599(ఎకరాల్లో)
వనపర్తి        810
మెదక్‌         578  

మరిన్ని వార్తలు