‘వీవీ’లు ఓకే..

13 Jun, 2019 07:12 IST|Sakshi

ఖమ్మంసహకారనగర్‌/నేలకొండపల్లి: ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల(వీవీ)ను నియమించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత విద్యా సంవత్సరం పని చేసిన వారిని రెన్యువల్‌ చేసేందుకు అనుమతిచ్చింది. జిల్లావ్యాప్తంగా 471 మంది విద్యా వలంటీర్లను కొనసాగించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు లేని జిల్లాలోని 6 పాఠశాలలకు కొందరిని అత్యవసరంగా నియమించగా.. రెండు, మూడు రోజుల్లో మిగతా పాఠశాలల్లో వీరిని నియమించనున్నారు.

జిల్లాలో 1,294 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,98,944 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో బాలికలు 96,936 మంది ఉండగా.. బాలురు 1,02,008 మంది ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో మాత్రం ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదికేడాది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్త టీచర్ల నియామకం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఒక్క ఉపాధ్యాయుడే రెండు, మూడు తరగతులకు బోధించాల్సి వస్తోంది. లేనిపక్షంలో విద్యావలంటీర్లతోనే ఎలాగోలా నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి.   
తీర్పునకు అనుకూలంగా..  
రాష్ట్రవ్యాప్తంగా విద్యా వలంటీర్లను ప్రతి ఏటా రెన్యువల్‌ చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులను భర్తీ చేసేవరకు వీరిని ఏటా రెన్యువల్‌ చేయాలని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో విద్యా శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. అయితే ప్రభుత్వం రెన్యువల్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 471 మంది విద్యా వలంటీర్లను రెన్యువల్‌ చేయనున్నారు. మండలాలవారీగా ఉద్యోగ విరమణ పొందనున్న ఉపాధ్యాయులు, ఏర్పడనున్న ఖాళీలు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు, ఇతర కారణాలతో ఖాళీలు, ఇతర అవసరాల రీత్యా వలంటీర్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని డీఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓలకు ఆదేశాలు అందాయి.
 
ఈసారి కూడా..  
గత ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు అనేక మంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈ ఏడాది విద్యావలంటీర్లు అదనంగా అవసరం అవుతారనే ఆలోచనలో విద్యా శాఖ ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది దాదాపు 731 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉంటుందని గుర్తించారు. ఈ మేరకు అంతమందిని నియమించుకునేందుకు అనుమతి కోరుతూ జిల్లా విద్యా శాఖ.. ఉన్నతాధికారులకు నివేదికను పంపించింది. అయితే ప్రస్తుతానికి 471 మంది విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు ఆమోదం లభించింది.
 
అందని వేతనాలు.. 
2018–19 విద్యా సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా విద్యా వలంటీర్లకు ప్రతి నెలా వేతనాలు అందలేదు. మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు జమ చేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ 12వ తేదీ వరకు వేతనాలు అందించాల్సి ఉంది. నెలకు రూ.12వేల చొప్పున పెండింగ్‌ వేతనాలు రావాల్సి ఉంది. విద్యా సంవత్సరం ముగిసి, తిరిగి ప్రారంభమైనా నేటి వరకు వేతనాలు అందలేదంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా.. సమాన వేతనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించు కుని నెలనెలా వేతనాలు జమ చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు