6.62 లక్షల మందికి...కొత్త 'ఆసరా'

23 Mar, 2020 02:03 IST|Sakshi

57 ఏళ్ల వయసుకు కుదింపుతో పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య

బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు రూ.2,356 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’దక్కనుంది. 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా 6.62 లక్షల మందికి ప్రయోజనం లభించనుంది. అసహాయులైన పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.46 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే జరిపి అర్హుల జాబితాను సేకరించింది.దీనికి అనుగుణంగా ఈ మేరకు వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని లెక్కతీసింది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను నమోదు చేస్తోంది. కేవలం దీన్నే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు జరిపి వయస్సును నిర్ధారించాలని నిర్ణయించింది.ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర ధ్రువీకరణల ఆధారంగా జాబితాను స్క్రీనింగ్‌ చేయనుంది. 

అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభుత్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కొత్తగా పెరిగే 6.62 లక్షల పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర భారం పడనుందని అంచనా. ఏప్రిల్‌ నుంచి ఈ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, దీనిపై కరోనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు