హైదరాబాద్‌ నుంచి శ్రామిక్‌ రైళ్లు

11 Jun, 2020 06:04 IST|Sakshi

నేడు ఒడిశాకు ఐదు రైళ్లు 

వలసకార్మికుల తరలింపునకు చర్యలు 

హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలింపునకు చర్యలు తీసుకున్నామని, గురువారం ఒడిశాకు హైదరాబాద్‌ నుంచి ఐదు శ్రామిక్‌ రైళ్లు బయల్దేరనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వీటి ద్వారా 9,200 మంది వెళ్తారని, ఇంకా మిగిలే 15,800 మంది కోసం ప్రభుత్వం బస్సు, రైలు వంటి రవాణా ఏర్పాట్లు చేస్తుందని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఒడిశాకు ఐదు శ్రామిక్‌ రైళ్లను నడపడం శుభపరిణామమని, ఇదే తరహాలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వలస కార్మికుల కోసం రెగ్యులర్‌ రైళ్లకు అదనంగా నాలుగు బోగీలను నడిపితే బాగుంటుందని సూచన చేసింది. సరిహద్దు, సమీప రాష్ట్రాలకు బస్సుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించింది.

తరలింపు చర్యలు పూర్తయ్యే వరకూ వలస కార్మికులకు ఆహారం, వసతి, వైద్యం అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రవాణా చార్జీలను కూడా రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. ఇటుక బట్టీల్లో వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ ప్రొఫెసర్‌ రామ శంకర్‌ నారాయణ్‌ మేల్కొటి, న్యాయవాది పి.వి.కృష్ణయ్య, జీవన్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. రాజస్తాన్, బిహార్, జార్ఖండ్‌లకు ఎందుకు రైళ్లను నడపటం లేదని ప్రశ్నించింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ఆర్టీసీ బస్సులు నడిపి వలస కార్మికులను తరలింపునకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.  

తెలంగాణ వినతిపై శ్రామిక్‌ రైళ్లు  
కోర్టుకు సహాయకారిగా నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదిస్తూ, రాష్ట్ర వినతిపై రైల్వే శాఖ శ్రామిక్‌ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. గురువారం ఐదు రైళ్ల ద్వారా ఒడిశాలోని బౌలంగీర్, శ్రీకాకుళంలోని నౌపడా ప్రాంతాల వారు వెళతారని, మరో నాలుగు రైళ్లను ఏర్పాట్లు చేస్తే అందరూ వెళ్లిపోతారని తెలిపారు. రెజిమెంటల్‌ బజార్‌లో 250 మంది వలస కార్మికులకు రెండే టాయిలెట్స్‌ ఉన్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఎగ్జిబిషన్‌లో మాదిరిగా తాత్కాలిక టాయిలెట్స్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచన చేసింది. రెగ్యులర్‌ రైళ్లకు నాలుగు బోగీల్లో వలస కార్మికులను తరలింపునకు కష్టం అవుతుందని రైల్వే తరఫు న్యాయవాది పి.కౌర్‌ చెప్పారు. అయినా హైకోర్టు సూచనను రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, శ్రామిక్‌ రైళ్ల ద్వారా వలస కార్మికులను పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని 1,218 ఇటుక బట్టీలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ సందర్శించారని, వాటిలో 64,669 మంది వలస కార్మికులు ఉన్నారని గుర్తించారని చెప్పారు. వారిలో 48,416 మంది వారి రాష్ట్రాలకు వెళ్లిపోయారని, ఇరవై జిల్లాల్లో 15,880 మంది రవాణా కోసం నిరీక్షిస్తున్నారని, వీరందరి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాదనల అనంతరం విచారణ 19కి వాయిదా పడింది.   

మరిన్ని వార్తలు