ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్‌’ ఫార్మసీలు

22 Nov, 2019 09:58 IST|Sakshi

ఉస్మానియా, గాంధీ సహా అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు

లీజు గడువు ముగిసిన మెడికల్‌ షాపులకు నోటీసులు 

అందుబాటులోకి జనరిక్, బ్రాండెండ్‌ మందులు, సర్జికల్స్, ఇంప్లాట్స్‌.. 

30 నుంచి 40 శాతం తక్కువ ధరకే అమ్మకాలు 

సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే మందులు, సర్జికల్స్, ఇంప్లాట్స్‌ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా ఆలిండియా మెడికల్‌ సైన్స్‌(ఎయిమ్స్‌)ల్లో ప్రారంభించి, విజయవంతమైన దీన్‌దయాళ్‌ ‘అమృత్‌’ మెడికల్‌ స్టోర్స్‌ను ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో జనరిక్‌ మందులతో పాటు బ్రాండెడ్‌ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రైవేటు మెడికల్‌ స్టోర్స్‌లోని బ్రాండెడ్‌ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్‌ ధరలతో పోలిస్తే ఈ అమృత్‌ మెడికల్‌ స్టోర్స్‌లో 30 నుంచి 40 శాతం తక్కువ ధరకే లభించనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో హెచ్‌ఎల్‌ఎల్‌కు షాపును కేటాయించారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. నిలోఫర్‌ సహా ఇతర ఆస్పత్రుల్లో సాధ్యమైనంత త్వరలోనే ఈ దుకాణాలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

బ్రాండెడ్‌ బాదుడుకు ఇక చెల్లుచీటీ..  
ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలో ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి సహా నిలోఫర్, ఈఎన్‌టీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి, నయూపూల్‌ ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఇక గాంధీ మెడికల్‌ కాలేజీ పరిధిలో గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ఓపీకి రోజుకు సగటున 2500 నుంచి 3000 మంది రోగులు వస్తుంటారు. మిగిలిన ఆస్పత్రుల ఓపీలకు రోజుకు సగటున 500 నుంచి 1200 మంది వస్తుంటారు.  ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్‌ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. వైద్యులు రాసిన వాటిలో చాలా మందులు ప్రభుత్వ ఫార్మసీలో దొరకడం లేదు. దీంతో ఆ మందులను రోగులే స్వయంగా సమకూర్చుకోవాలి. ఇందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్‌ షాపులను ఆశ్రయిస్తుంటే.. దుకాణదారులు బ్రాండెడ్‌ పేరుతో అధిక ధరల మందులు ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కేవలం అవుట్‌ పేషంట్లకు మాత్రమే గాక.. ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు కూడా చాలా రకాల మందులను బయటే కొంటున్నారు. అమృత్‌ స్టోర్స్‌ ఏర్పాటుతో ఖరీదైన మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్‌ సైతం తక్కువ ధరకే పొందే అవకాశం ఉండడంతో పేద రోగులకు మేలు జరగనుంది.  

ఏళ్ల నుంచి ప్రైవేటు షాపుల దందా 
గతంలో నిమ్స్‌ సహా ఉస్మానియా, గాంధీలోనూ జీవన్‌ధార పేరుతో జనఔషధి మెడికల్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. రోగుల నుంచి వీటికి మంచి ఆధరణ కూడా లభించింది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో లీజుపై కొనసాగుతున్న ప్రైవేటు మెడికల్‌ షాపుల నిర్వహకులు స్థానిక వైద్యులతో కుమ్మక్కై వాటిని సంక్షోభంలోకి నెట్టేశారు. ప్రస్తుతం ఒక్క ఉస్మానియాలోనే విజయవంతంగా కొనసాగుతోంది. గాంధీలో దాదాపు మూతపడే స్థితికి చేర్చారు. ఇక నిమ్స్‌లో మూడేళ్ల క్రితమే దుకాణం ఏత్తేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీలో మూడు, ఉస్మానియాలో రెండు, నిలోఫర్‌లో ఒక ప్రైవేటు మెడికల్‌ స్టోర్లు కొనసాగుతున్నాయి. ఒక్కో స్టోర్‌లో రోజుకు సగటున రూ.2 లక్షల విలువ చేసే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఇప్పటికే ఆయా దుకానాల లీజు గడువు కూడా ముగిసింది. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్‌ షాపులకు అనుమతి ఇవ్వరాదనే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. కొంత మంది అధికారులు ఆయా షాపుల నిర్వహాకులతో కుమ్మక్కై.. కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు ఇప్పించడం వివాదాస్పదంగా మారింది.  

మరిన్ని వార్తలు