ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త

26 Aug, 2018 08:47 IST|Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వరం ప్రకటించింది. ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తూ.. విద్యుత్‌శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నిరుపేద షెడ్యూల్డ్‌ కులాలకు అండగా నిలవాలని భావించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఆ వర్గాల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వం తాజాగా 101యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

టీవీలు, ఇతర విద్యుత్‌ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్‌ వినియోగం ఎక్కువైందని భావించిన సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. 101 యూనిట్లకయ్యే విద్యుత్‌చార్జీలను డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ ఉమ్మడి సర్కిల్‌ పరిధిలో 26,069 సర్వీసులకు ప్రయోజనం చేకూరనుండగా.. ఇందుకయ్యే నెలకయ్యే రూ.50,60,101 విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది.

26,069 సర్వీసులకు ప్రయోజనం
కరీంనగర్‌ ఉమ్మడి సర్కిల్‌ పరిధిలోని 26,069 విద్యుత్‌ సర్వీసులకు ప్రయోజనం చేకూరుతుండగా.. ఇందుకు సంబంధించిన రూ.50,60,101 విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వం భరించనుంది. ఎస్సీ 24,778 సర్వీసులకు గాను రూ.47,88,299లు, ఎస్టీ 1291 సర్వీసులకు గాను రూ.2,71,802ల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనుంది.

 
ఆదేశాలు రాగానే అమలు: కె.మాధవరావు, ఎస్‌ఈ, కరీంనగర్‌ సర్కిల్‌
ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ నుంచి ఆర్డర్‌ రాగానే అమలు చేస్తాం. ఇంకా పేర్లు నమోదు చేసుకోని వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధిత ఏఈలకు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు