18,428 పోలీసు పోస్టులకు నోటిఫికేషన్‌

1 Jun, 2018 01:08 IST|Sakshi

జూన్‌ 9 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

మొత్తం ఉద్యోగాల్లో 16,767 కానిస్టేబుల్‌ పోస్టులు

ప్రస్తుతం విభాగాల వారీగా సంఖ్య వెల్లడి 

వయోపరిమితి సడలింపుపై తేల్చని రిక్రూట్‌మెంట్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా 18,428 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పోలీసు శాఖతోపాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. జూన్‌ 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్‌సైట్‌ (www.tslprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు కూడా వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఎస్సై, ఆ స్థాయి ఇతర పోస్టుల సంఖ్య, అర్హతలివీ.. 
పోస్టు                                               విభాగం               ఖాళీలు 
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుష, మహిళా)        సివిల్‌ విభాగం         710 
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుష, మహిళా)         ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌         275 
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుష)                   ఎస్‌ఏఆర్, సీపీఎల్‌        05 
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుష)                     టీఎస్‌ఎస్‌పీ             175 
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుష)                    15వ బెటాలియన్‌        16 
స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌                            అగ్నిమాపక శాఖ         19 
డిప్యూటీ జైలర్‌                                      జైళ్ల శాఖ               15 
అసిస్టెంట్‌ మాట్రన్‌                                  జైళ్ల శాఖ                 2 

అర్హతలు.. ఫీజులు.. 
ఈ పోస్టుల్లో పోలీసు విభాగంలోని ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు జూలై 1, 2018 నాటికి 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (1993 జూలై 2 నుంచి 2000 జూలై 1 లోపు జన్మించి ఉండాలి). అగ్నిమాపకశాఖలోని ఉద్యోగాలకు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్లలోపు (జూలై 2 1988 నుంచి 2003 జూలై 1లోపు జన్మించి) ఉండాలి. జైళ్ల విభాగంలోని డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు 21 ఏళ్ల నుంచి 33 ఏళ్లలోపు (జూలై 2, 1988 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. జైళ్ల శాఖలోని అసిస్టెంట్‌ మాట్రన్‌ ఉద్యోగాలకు 21 నుంచి 28 ఏళ్ల లోపు (జూలై 2 1993 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. జనరల్, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్‌ లేదా పాలిటెక్నిక్‌ అర్హత ఉండాలి. దరఖాస్తు ఫీజు ప్రతి పోస్టుకు.. ఓసీ, బీసీ అ«భ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500. 

కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల సంఖ్య అర్హతలివీ.. 
పోస్టు                                           విభాగం             ఖాళీలు 
కానిస్టేబుల్‌ (పురుష, మహిళా)       పోలీస్‌ సివిల్‌           5,909 
కానిస్టేబుల్‌ (పురుష, మహిళా)       ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌          5,273 
కానిస్టేబుల్‌ (పురుష)                   ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌           53 
కానిస్టేబుల్‌ (పురుష)                    టీఎస్‌ఎస్‌పీ              4,816 
కానిస్టేబుల్‌ (పురుష)                    ఎస్‌పీఎఫ్‌                   485 
ఫైర్‌మన్‌                                    అగ్నిమాపక శాఖ         168 
వార్డర్స్‌ (పురుష)                         జైళ్ల శాఖ                    186 
వార్డర్స్‌ (మహిళ)                         జైళ్ల శాఖ                      35 
మొత్తం                                                                 16,925 

అర్హతలు.. ఫీజులు.. 
పోలీసుశాఖలోని కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు (జూలై 2 1996 నుంచి జూలై 1 2003 మధ్య జన్మించి) ఉండాలి. ప్రస్తుతం హోంగార్డులుగా పనిచేస్తున్నవారైతే గత రెండేళ్లలో కనీసం 365 రోజులు విధులకు హాజరై ఉండాలి. వీరు 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లలోపు (జూలై 2 1978 నుంచి జూలై 1 2003 మధ్య జన్మించి) ఉండాలి. ఇక అగ్నిమాపక, జైళ్ల శాఖల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలోపు వయసు ఉండాలి. ఈ పోస్టులన్నింటికీ జనరల్, బీసీ అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు చదువుతున్న వారుకూడా అర్హులే. ఇక ఈ ఉద్యోగాల్లో ప్రతి పోస్టుకు దరఖాస్తు ఫీజు.. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400. 

మహిళలకు వయోపరిమితి వెసులుబాటు 
మహిళా కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి పలు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఒంటరి మహిళలు/విడాకులు తీసుకున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఇతర కేటగిరీల మహిళా అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లలోపు వయసు ఉండాలి. 

కమ్యూనికేషన్‌ విభాగంలో పోస్టులు, అర్హతలివీ.. 
ఇటీవల పోలీసుశాఖలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పోలీసు కమ్యూనికేషన్స్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. ఈ మేరకు కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ విభాగం, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో పోస్టుల భర్తీ చేపట్టారు. 

పోస్టు                                            విభాగం                        ఖాళీలు 
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుష, మహిళా)    కమ్యూనికేషన్స్, ఐటీ           29 
అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌                 ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో           26 
కానిస్టేబుల్‌ (పురుష, మహిళా)         కమ్యూనికేషన్స్, ఐటీ         142 
కానిస్టేబుల్‌ (మెకానిక్‌)                   ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌           19 
కానిస్టేబుల్‌ (డ్రైవర్స్‌)                      ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌           70 

ఎస్సై, ఏఎస్సై ఆస్థాయి పోస్టులకు అర్హతలు, ఫీజులివీ.. 
కమ్యూనికేషన్స్‌–ఐటీ విభాగంలోని ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్‌ విభాగంలో లేదా ఎలక్ట్రానిక్, కంప్యూటర్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ (బీఈ/బీటెక్‌) పూర్తిచేసి ఉండాలి. ఇక ఏఎస్సై పోస్టుల కోసం కంప్యూటర్‌ సైన్స్‌ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ రెండు పోస్టులకు వయసు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు (జూలై 2 1993 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. దరఖాస్తు ఫీజులు ప్రతి పోస్టుకు.. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500. 

కానిస్టేబుల్‌ తత్సమాన పోస్టులకు అర్హతలు, ఫీజులివీ.. 

  • కమ్యూనికేషన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 25ఏళ్లలోపు వయసు (జూలై 2 1996 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. పదో తరగతితో పాటు ఐటీఐ లేదా ఐటీ, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ ఆపరేషన్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్, మెకానిక్‌ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితర వొకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇక కానిస్టేబుల్‌ మెకానిక్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదోతరగతితో పాటు ఐటీఐలో వైర్‌మన్‌ లేదా మెకానిక్, ఫిట్టర్‌ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. 
  • కానిస్టేబుల్‌ డ్రైవర్‌ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదో తరగతితో పాటు ఐటీఐలో ఎలక్ట్రానిక్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ లేదా మెకానిక్‌ డీజిల్, ఫిట్టర్‌ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అర్హత కింద లైట్‌ మోటార్‌ వెహికల్‌ (ఎల్‌ఎంవీ) లైసెన్స్‌తో పాటు బ్యాడ్జ్‌ నంబర్‌ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్‌ వెహికల్‌ (హెచ్‌ఎంవీ) లైసెన్స్‌ పొంది, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
  • అభ్యర్థులెవరైనా తగిన విద్యార్హతలుండి ప్రస్తుతం హోంగార్డులుగా పనిచేస్తుంటే.. 43 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి వెసులుబాటు ఉంటుంది. వారు గత రెండేళ్లలో కనీసం 365 రోజుల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 
  • కమ్యూనికేషన్స్‌ విభాగంలో మహిళా కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి వయో పరిమితి సడలింపు ఉంది. ఒంటరి మహిళలు/విడాకులు తీసుకున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఇతర కేటగిరీల మహిళా అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లలోపు వయసు ఉండాలి. 
  • దరఖాస్తు ఫీజులు ఒక్కో పోస్టుకు ఓసీ, బీసీలకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400. 


ప్రిలిమ్స్‌.. ఫిజికల్‌ టెస్ట్‌.. మెయిన్స్‌.. 
గతంలో నిర్వహించిన విధంగానే పోలీసు పోస్టుల భర్తీ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందని అధికారులు తెలిపారు. తొలుత ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహిస్తామని.. అందులో ఎంపికైన అభ్యర్థులకు శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిలోనూ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 

వయో పరిమితి సడలింపుపై స్పష్టత కరువు 
పోలీసు పోస్టుల భర్తీలో వయో పరిమితి సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కొంతకాలంగా ప్రభుత్వంపై, పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేసిన తొలి నియామకాల్లో వయో పరిమితి సడలింపు ఇచ్చారని.. ఈసారి కూడా సడలింపు ఇస్తే వేలాది మంది నిరుద్యోగులకు అవకాశం వస్తుందని విజ్ఞప్తి చేశారు. కానీ గురువారం ఇచ్చిన నోటిఫికేషన్‌లో వయో పరిమితి సడలింపుపై సమాచారం లేదు. ఏ రిజర్వేషన్‌కు ఎన్ని పోస్టులు, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులన్న అంశాలపైనా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులను వివరణ కోరగా... సిలబస్, ఎంపిక తేదీలు, రిజర్వేషన్లు తదితర వివరాలన్నింటినీ త్వరలో వెబ్‌సైట్‌లో పెట్టనున్న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు