వారంలోనే పరిషత్‌ ఫలితాలు 

28 May, 2019 07:49 IST|Sakshi

వెంటనే ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలు 

పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ 

ఆర్డినెన్స్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

వేగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌.. మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌ చట్టంలో ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో వారంలో రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. వెంటనే జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలు సైతం పూర్తి కానున్నాయి. జూన్‌ 10లోపే ఫలితాల వెల్లడి, పరోక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయంలో అధికారిక తేదీలు ప్రకటించనుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14తో ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈనెల 27న నిర్వహించాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది.
 
ఆర్డినెన్స్‌లో పలు మార్పులు.. 
ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘మొదటి సమావేశం’ అనే పదానికి బదులుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘ప్రత్యేక సమావేశం’అనే మార్పు చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్న మొదటి సమావేశం అంటే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిచిన వారు మొదటిసారి సమావేశమై ఎంపీపీ, జెడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, కో–ఆప్టెడ్‌ సభ్యులను ఎన్నుకోవాలి. వెంటనే కొత్తగా ఎన్ని కైన వారి పదవీకాలం మొదలవుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం జూలై 4 వరకు ఉన్నందున ఆ తర్వాతే మొదటి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది.

మొదటి సమావేశం అనే పదాన్ని ‘ప్రత్యేక సమావేశం’ అని చట్టంలో సవరణ చేయడంతో జూలై 4 వరకు వేచి చూడకుండా ఆలోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను వెల్లడించవచ్చు. ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలను వెంటనే చేపట్టొచ్చు. చట్టంలో సవరణ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జూలై 3 వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాలకవర్గాలు బాధ్యతలు చేప ట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రస్తుత ఉమ్మడి జిల్లా ల్లోని 8 జెడ్పీపీల పాలకవర్గాల పదవీకాలం జూలై 4 తో ముగుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 6 వరకు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ పరిధిలో ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూ డెం జెడ్పీలు ఏర్పాటవుతున్నాయి. ఈ జెడ్పీపీల పదవీకాలం ఆగస్టు 7 నుంచి మొదలుకానుంది.

జూలై 3న లెక్కింపు... 
జిల్లాపరిషత్, మండల పరిషత్‌ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4న ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు పరోక్ష ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు మధ్య ఎక్కువ రోజులు ఉండటం వల్ల పరోక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారని, ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జూలై 3న చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. అయితే పాఠశాలలు, విద్యా సంస్థలలో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు. జూన్‌ మొదటివారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును, పరోక్ష ఎన్నికలను త్వరగా పూర్తి చేసేలా ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపింది.
 

మరిన్ని వార్తలు