రేపటి నుంచే ‘పాల’ ప్రోత్సాహకం

23 Sep, 2017 01:52 IST|Sakshi

మదర్, ముల్కనూరు, కరీంనగర్‌ డెయిరీ రైతులకు వర్తింపు

లీటర్‌కు రూ.4 చొప్పున ప్రకటిస్తూ జీవో జారీ

1.98 లక్షల మంది రైతులకు ప్రయోజనం: తలసాని

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు పాల సహకార సంఘాల్లోని రైతులకు ప్రోత్సాహకం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విజయ డెయిరీ రైతులకు అందజేస్తున్న తరహాలో లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తామని, 24వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. సచివాలయంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై శుక్రవారం తలసాని సమీక్ష నిర్వహించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌ చందా, తెలంగాణ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, ముల్కనూరు డెయిరీ చైర్మన్‌ విజయ, పశుసంవర్థకశాఖ అదనపు డైరెక్టర్‌ రాంచందర్‌రావు తదితరులు పాల్గొ న్నారు. ఇతర డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు  ప్రోత్సాహకం చెల్లిస్తామన్న సీఎం హామీ మేరకు జీవో విడుదల చేశామని సమావేశం అనంతరం తలసాని తెలిపారు.

1.98 లక్షల మందికి ప్రయోజనం
మదర్‌ డెయిరీకి పాలుపోస్తున్న 55 వేల మంది, ముల్కనూరు డెయిరీ పరిధిలోని 20 వేల మంది, కరీంనగర్‌ డెయిరీ పరిధిలోని 70 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మొత్తంగా ప్రోత్సాహకంతో 1.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహకం సొమ్మును పాల బిల్లు చెల్లింపులతో పాటే లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. అలాగే ప్రోత్సాహకం పొందే రైతులకు సబ్సిడీపై పాడి గేదెలను అందిస్తామని, ఈ పథకంతో ప్రభుత్వంపై రూ.600 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొన్నారు. సబ్సిడీ గేదెలు పొందిన రైతులకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలనూ సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్‌ విజయ డెయిరీలో రూ.170 కోట్ల వ్యయంతో 4.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పాల పొడి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా పాడిరంగం అభివృద్ధిలో గుత్తా సుఖేంద ర్‌రెడ్డికి ఎంతో అనుభవం ఉన్నందున.. ఆయన సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు.

రాజీనామాపై గుత్తా మౌనం
నల్లగొండ ఎంపీ స్థానానికి రాజీ నామా చేసే అంశంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి మౌనం దాల్చారు. రైతు సమన్వయ సమితి రాష్ట్రస్థాయి సమన్వయకర్తగా గుత్తాను నియమించి కేబినెట్‌ ర్యాంకు ఇస్తారని.. తన ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా రాజీనామా అంశాన్ని ప్రస్తావించగా.. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు