‘గిరి’ పుత్రికకు అభయం!

26 Feb, 2018 02:37 IST|Sakshi

ఆడపిల్లల విక్రయాలు అరికట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ కొత్త పథకం

తండాల్లోని నిరుపేద శిశువు పేరిట రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు యోచన

ఆ నిధిని 18 ఏళ్ల తర్వాత విత్‌డ్రా చేసేలా నిబంధన

తాజా బడ్జెట్‌లో గిరిజన శాఖ ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌ : తండాల్లో ఆడపిల్లల విక్రయాలను అరికట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆడ శిశువుకు అభయం ఇచ్చేందుకు ఆర్థిక సహకార పథకాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పేరిట ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరహాలో గిరిజన తండాల్లోని పేదింట్లో పుట్టిన ఆడశిశువుకు అభయంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మగపిల్లాడు కావాలనే ఆరాటంతో వరుసగా ఆడపిల్లలు పుట్టడం, పేదరికం కారణంగా వారిని సాకలేమంటూ దూరం చేసుకుంటున్నారు. ఇలా శిశువుల్ని విక్రయించడం, విషయం బయటకు పొక్కితే శిశువిహార్‌ తరలించడం వంటి సంఘటనలు ఇప్పటికీ తండాలు, గిరిజన ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసే దిశగా గిరిజన సంక్షేమ శాఖ ముందుకు సాగుతోంది.

18 ఏళ్ల వరకూ..
తండాలు, ఏజెన్సీల్లో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఉంది. సగటున వెయ్యి మంది పురుషులకు 945 మహిళలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పేదింట్లో ఆడపిల్ల పుడితే శిశువు పేరిట రూ.లక్ష వరకు సమీప బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. ఇలా డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని 18 ఏళ్ల వరకు విత్‌డ్రా చేసే వీలుండదు.

అలా అమ్మాయి పెళ్లి నాటికి డిపాజిట్‌ మొత్తం రూ.10 లక్షల వరకు పెరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తోంది. దీంతో అమ్మాయి పెళ్లికి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడదని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్‌ అంచనాలకు ఉపక్రమించింది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి పథకం కింద ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా కొత్త పథకాన్ని అమలు చేస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంశంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.

2018–19 బడ్జెట్‌ ఖరారయ్యే నాటికి ఈ పథకానికి సంబంధించి ప్రతిపాదనలను సమర్పిస్తామని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

>
మరిన్ని వార్తలు