ఈసారీ విద్యా వలంటీర్లే

3 Jun, 2018 00:47 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో 16,781 వీవీల నియామకానికి ఆదేశాలు

గౌరవ వేతనంగా నెలకు రూ.12 వేలు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో విద్యా వలంటీర్ల (వీవీ) నియామకానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పెద్ద ఎత్తున టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం, భర్తీ ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో.. 16,781 మంది వీవీలను నియమించుకోవాలని ఆదేశించింది. తక్షణమే వీవీల నియామకాలను పూర్తిచేసి, విధుల్లో చేరేలా చూడాలని విద్యా శాఖను.. వారికి జూన్‌ నెలకు సంబంధించిన వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 15,473 చోట్ల ఖాళీ పోస్టులు, సెలవులతో ఏర్పడిన ఖాళీలుకాగా.. మరో 1,308 మంది వీవీలను తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాలు మినహా మిగతా మాధ్యమాల్లో కొనసాగుతున్న స్కూళ్లలో తెలుగు భాష సబ్జెక్టు బోధించేందుకు నియమిస్తారు. విద్యా వలంటీర్లకు నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  

మెరిట్‌ ఆధారంగానే.. 
విద్యా వలంటీర్ల ఎంపిక ప్రక్రియ మెరిట్‌ ఆధారంగా సాగనుంది. మండలాల వారీగా ఖాళీలను ప్రదర్శించిన అనంతరం.. మండల విద్యాశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిలో మెరిట్‌ ఆధారంగా జాబితా రూపొందిస్తారు. జిల్లావిద్యాధికారి (డీఈవో) ఆమోదంతో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. వీవీల ఎంపిక ప్రక్రియలో రోస్టర్‌ పాయింట్లను సైతం అనుసరించనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తాజాగా నియమించే వీవీలు రెగ్యులర్‌ టీచర్లు వచ్చే వరకు కొనసాగుతారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి డీఈవోలకు ఆదేశాలు అందాయి.

మరిన్ని వార్తలు