ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌పై సర్కారు పునరాలోచన

24 Apr, 2018 01:01 IST|Sakshi

దీనిపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు

గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం పడుతుందనే భావన

కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలోని మరిన్ని నిబంధనలపైనా సమీక్ష

కార్యదర్శులపై కఠినచర్యల నిబంధనలకు వ్యతిరేకత

దీంతో పలు అంశాలను సవరించాలనే యోచన

అందువల్లే పలు నిబంధనల అమలుకు మినహాయింపు!

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామాల్లో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు ఉమ్మడిగా చెక్‌ పవర్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దీనిని ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో చేర్చి ఆమోదం పొందినా... ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ఉప సంహరించుకోవాలని భావిస్తోంది. దీనితోపాటు కొత్త చట్టంలోని పలు ఇతర నిబంధనలనూ మార్చాలని యోచిస్తోంది. ఇందుకోసం చట్టానికి సవరణలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ దిశగానే కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు నిబంధనలను అమల్లోకి తీసుకురాకుండా ‘మినహాయింపు’ పేరిట నిలిపివేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. 
ఇటీవలి వరకు అమల్లో ఉన్న పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్‌ పవర్‌ ఉండేది. అయితే ఏప్రిల్‌ 18 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. గ్రామ కార్యదర్శి అధికారానికి కత్తెర వేసింది. దానికి బదులుగా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ను కల్పించింది. కానీ కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చినా.. ఉప సర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ అంశాన్ని అమల్లోకి తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే దీనికి కారణం. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా చెక్‌ పవర్‌ ఇస్తే రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా, వారి మధ్య రాజకీయ స్పర్థలున్నా.. సమన్వయం లోపించి, నిధుల వినియోగం గాడి తప్పుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది. 

గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం 
సాధారణంగా గ్రామ సభ తీర్మానాలు, పాలకవర్గం నిర్ణయాలకు అనుగుణంగానే గ్రామాల్లో నిధులు ఖర్చు చేస్తారు. గ్రామ కార్యదర్శి– సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్‌ పవర్‌ ఉన్నప్పుడు... సర్పంచ్‌ ఏదైనా చెక్కుపై సంతకం చేస్తే, ఆ నిధులను వేటికి ఖర్చు చేస్తున్నారు, సంబంధిత తీర్మానం ఉందా.. లేదా వంటి అంశాలను కార్యదర్శి పరిశీలించి సంతకం చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారి పరిశీలన విధానం కాకుండా.. నేరుగా ఇద్దరు ప్రజాప్రతినిధులకే చెక్‌ పవర్‌ కల్పించారు. దీనివల్ల నిధుల వినియోగం ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ నిబంధనను అమలుపై సర్కారు పునరాలోచనలో పడింది. 

మరిన్ని అంశాలపైనా సందిగ్ధం..! 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తొమ్మిది అంశాలను మాత్రం ప్రస్తుతం అమల్లోకి తేవడం లేదంటూ మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం 2018 జూలై ఆఖరుతో ముగుస్తుందని.. అనంతరం అన్ని నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ సర్పంచ్‌–ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. వాటిలో సవరణలు చేసే అవకాశమున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త చట్టంలో నుంచి అమలు మినహాయించిన అంశాల్లో... ఉప సర్పంచ్‌కు చెక్‌ పవర్, ఆడిట్‌ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగించటం, గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి కార్యదర్శిపై చర్యలు, సర్పంచ్‌లను సస్పెండ్‌ చేసేలా కలెక్టర్‌కు అధికారాలు, కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగపర్చకుంటే చర్యలు, లేఔట్లు–భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సమకూర్చటం, పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు, పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభ కోరం ఉండాలనే నిబంధనలను మినహాయించారు. ఇందులో గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెక్‌ పవర్‌ లేకున్నా కార్యదర్శులను ఆడిటింగ్‌ బాధ్యులను చేయటం, హరితహారం మొక్కల పెంపకంలో చర్యలు తీసుకునేలా నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల్లో సర్పంచ్‌లనే బాధ్యులుగా చేయాల్సిన సర్కారు.. కార్యదర్శులపై కటువుగా ఉండటమేమిటనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని పలు నిబంధనలను సవరించడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు