ఇక మస్కిటోలు.. మస్కా ‘కుట్ట’లేవు!

11 Nov, 2019 04:13 IST|Sakshi

మస్కీట్‌’తో దోమల గణన..

సిటీలో వ్యాధికారక దోమల గుర్తింపునకు ప్రత్యేక డివైస్‌

ప్రయోగాత్మకంగా 5 ప్రాంతాల్లో ఏర్పాటు

∙ఆకర్షించే వాసనలతో దోమల ట్రాప్‌

∙చిక్కిన దోమలతో ఏ వ్యాధి కలిగించేవెన్నో అంచనా

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరవాసుల్ని దోమలు ఎడాపెడా కుట్టి పారేశాయి. డెంగీ కేసులు పెరిగిపోయాయి. దీంతో ఏకంగా హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సహా పలువురిని తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దోమల నివారణ చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఏ ప్రాంతంలో డెంగీ కారక దోమలు ఎక్కువున్నాయో గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ‘మస్కీట్‌’అనే ఉపకరణాలను శేరిలింగంపల్లి జోన్‌ మినహా మిగతా ఐదు జోన్లలోని ఐదు ప్రాంతాల్లో అమర్చారు. వీటి ద్వారా వెల్లడయ్యే లెక్కలతో ఆయా ప్రాంతాల్లోని దోమల రకాల్ని గుర్తిస్తారు.ఆపై నివారణ చర్యలు చేపడతారు.

‘మస్కీట్‌’లు ఎక్కడెక్కడ?
 సికింద్రాబాద్‌ జోన్‌– బేగంపేట
 కూకట్‌పల్లి జోన్‌– బోరబండ
ఎల్‌బీనగర్‌ జోన్‌– నాచారం
 చార్మినార్‌ జోన్‌– మలక్‌పేట
ఖైరతాబాద్‌ జోన్‌– జీహెచ్‌ఎంసీప్రధాన కార్యాలయం
902:  గ్రేటర్‌లో సెపె్టంబర్‌ 5 – అక్టోబర్‌ 30 మధ్య ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన డెంగీ కేసులు
1,415: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోధ్రువీకరించిన డెంగీ అనుమానిత కేసులు  

బేగంపేటలో దోమల బెడద ఎక్కువ..

  • మస్కీట్‌ ఉపకరణాల్లోకి చేరిన దోమలను లెక్కించడం ద్వారా డెంగీని వ్యాపించే దోమలు బేగంపేట, నాచారం ప్రాంతాల్లో ఎక్కువున్నట్టు గుర్తించారు. బోరబండ, మలక్‌పేట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • డెంగీ, చికున్‌గున్యా కు కారణమైన ఈడిస్‌ ఈజిప్టి, ఈడిస్‌ అల్బోపిక్టస్‌ తెగలకు చెందిన దోమలు, మలేరియా కారకాలైన అనాఫిలిస్‌ సబ్‌పిక్టస్, అనాఫిలిస్‌ క్యూలిసిఫేసీస్‌ కూడా బేగంపేట లోనే ఎక్కువ.
  • మెదడువాపు, బోదకాలు వ్యాధులకు కారణమైన క్యూలెక్స్‌ క్వింక్‌లకు సైతం బేగంపేటనే అడ్డా.. తరువాత స్థానంలో బోరబండ ఉంది.
  • ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో మాత్రం అన్ని రకాల దోమలూ స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి.

ఐదుచోట్ల లెక్కలతో అంచనా కష్టం
వివిధ రకాల దోమలు సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోనే ‘మస్కీట్‌’కు ఎక్కువగా చిక్కాయి. ఇంత పెద్ద మహానగరంలో ఐదు ప్రాంతాల్లోని లెక్కల ఆధారంగా దోమల రకాలను అంచనా వేయడం కష్టమని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ డాక్టర్‌ రాంబాబు తెలిపారు. దాదాపు వంద ప్రాంతాల్లో ఇటువంటివి ఏర్పాటైతే ఏ వ్యాధికారక దోమలు ఎక్కువున్నాయో స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం ఉపకరణాలు బిగించిన ప్రాంతాల్లో ఏ రకం దోమలు ఎక్కువున్నాయో గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. నెల పాటు అధ్యయనం తరువాత ‘మస్కీట్‌’లెక్కలపై స్పష్టత వస్తుందన్నారు.

‘మస్కీట్‌’ఇలా పని చేస్తుంది..

  • మస్కీట్‌ ఉపకరణాల్లో లిక్విడ్, సెన్సర్లతో పాటు ఉండే ప్రత్యేక వాసనలు వదులుతారు. వీటికి దోమలు ఆకర్షితమై ఉపకరణాల్లోకి చేరతాయి.
  • మస్కీట్‌కు అనుసంధానించిన కంప్యూటర్‌ డ్యాష్‌బోర్డు ఆధారంగా ఇలా చేరిన దోమల్లో రకానివెన్నో విశ్లేషిస్తారు.
  • ఆయా ప్రాంతాల్లో ఏయే వేళల్లో దోమల తీవ్రత ఎక్కువ ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు.
  • ఒక్కో మస్కీట్‌ ఉపకరణానికి జీహెచ్‌ఎంసీ రూ.70 వేల చొప్పున వెచ్చించింది.
  • ఈ యంత్రాలం వినియోగం ద్వారా మొదట ఆయా ప్రాంతాల్లోని దోమల రకాలను గుర్తిస్తారు. తద్వారా ఆయా దోమకారక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటారు.
మరిన్ని వార్తలు