22న బడ్జెట్‌

15 Feb, 2019 02:43 IST|Sakshi

24న అసెంబ్లీలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. నెలాఖర్లోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆలోపే శాసనసభ ఆమోదం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే.. 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని గురువారం అధికారికంగా ప్రకటించింది. 22న ఉదయం 11:30కు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సభకు ప్రతిపాదిస్తారు. బడ్జెట్‌పై 24న శాసనసభ చర్చిస్తుంది. 25న ఉభయ సభలు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి.. నిరవధికంగా వాయిదా పడుతాయి.

ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా..: ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా బడ్జెట్‌ రూపకల్పన ఉండాలని, పేదల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయించేలా కూర్పు ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్‌ రూపొం దించాలని అధికారులకు సూచించారు. తాత్కాలిక బడ్జెట్‌ రూపకల్పన, బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా్ణరావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు