ప్రచార జోరు 

30 Nov, 2018 12:31 IST|Sakshi

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచార జోరును పెంచాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం ఊపందుకోగా, బహిరంగ సభల నిర్వహణలో మాత్రం ఇతర పార్టీలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు ఆ పార్టీ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించింది. ప్రచార గడువు ముగిసే నాటికి మరో రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. డిసెంబర్‌ 2న పటాన్‌చెరులో బహిరంగ సభ ఉండగా, కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌లో సభ నిర్వహణపై స్పష్టత రావాల్సి ఉంది. 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచార పర్వంలో పరుగులు తీస్తున్నాయి. శాసనసభ రద్దయి, ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్, బీజేపీ మినహా మహా కూటమి చెప్పుకోదగిన స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించలేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు, పటాన్‌చెరు, దుబ్బాక మినహా ఇతర అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ సభలు జరిగాయి.

అసెంబ్లీ రద్దయిన తర్వాత సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్, ఈ నెల 20న సిద్దిపేట, 22న మెదక్‌లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా ఈ బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. వచ్చే నెల ఐదో తేదీతో ఎన్నికల ప్రచార  పర్వానికి తెరపడనుండగా, డిసెంబర్‌ 2న మధ్యాహ్నం మూడు గంటలకు పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. కేసీఆర్‌ పాల్గొనే సభలకు సంబంధించి డిసెంబర్‌ 4వ తేదీ వరకు పార్టీ వర్గాలు షెడ్యూలు విడుదల చేశాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో బహిరంగ సభకు సంబంధించిన వివరాలు లేవు. దీంతో కేసీఆర్‌ గజ్వేల్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం సాధ్యమయ్యే సూచన కనిపించడం లేదు.

బీజేపీ మినహా ఇతర పార్టీల్లో
ఎన్నికల ప్రచార పర్వం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ మాత్రమే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించింది. ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నారాయణఖేడ్, దుబ్బాక నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొనగా, గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జహీరాబాద్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. సెప్టెంబర్‌ 27న చేగుంట సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అక్టోబర్‌ 15న సంగారెడ్డిలో జరిగిన సభలో కేంద్ర మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన మొదలుకుని ప్రచార పర్వంలోనూ వెనుకంజలో ఉన్న మహా కూటమి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో చెప్పుకోదగిన సభ ఏదీ నిర్వహించలేదు.

టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నర్సాపూర్, జహీరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలకు హాజరయ్యారు. మరో ఆరు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడుతున్నా మహా కూటమి పక్షాన భారీ సభల ఊసు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే బహిరంగ సభల నిర్వహణతో జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌.. మరో ఆరు రోజుల పాటు ఇంటింటి ప్రచారంతో పాటు, ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రచార వేడి తగ్గకుండా చూసుకునే యోచనలో ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో పోటీ పడేందుకు పరుగులు తీస్తున్నారు.

>
మరిన్ని వార్తలు