హరిత ప్రణాళికలు సిద్ధం

22 Sep, 2019 05:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో హరిత ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 530 గ్రామాల్లో మినహా మొత్తం 12,221 పంచాయతీల్లో గ్రీన్‌ ప్లాన్‌ రూపొందించుకున్నట్లు గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు అందజేశారు. ఈ ప్రణాళికలో భాగంగా పెద్దసంఖ్యలో మొక్కలు నాటడం, నాటిన మొక్కలను కాపాడుకోవడం ముఖ్యకర్తవ్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచడం, వాటిని గుర్తించినచోట్ల నాటడం, ఇళ్ల పరిసరాల్లో నాటేందుకు యజమానులకు పంపిణీ చేయడం, వాటి సంరక్షణ చర్యలను గురించి హరిత ప్రణాళికల్లో వివరిస్తున్నారు.

12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక .. 
ప్రస్తుతం గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక చురుకుగా అమలవుతున్న నేపథ్యంలో 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికకు తుదిరూపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికను స్ఫూర్తిగా తీసుకుని ఏడాది పొడవునా నిర్వహించేలా 365 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ తీర్మానాలను పంచాయతీ, గ్రామసభల్లో తీర్మానం చేసుకుని ఏడాది అంతా అభివృద్ధి పనులు కొనసాగించే దిశలో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామాల్లో నియమితులైన స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, పంచాయతీల పాలకవర్గాలు ఈ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు గాను 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికలు సిద్ధమైనట్టు పీఆర్‌శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వార్షిక ప్రణాళికలు రూపొందించుకున్న గ్రామాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయానికి తమ నివేదికలను అందజేసినట్టు సమాచారం. వార్షిక ప్రణాళికలో భాగంగా వారంలో ఒక రోజు వీధుల్లో, గ్రామంలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి శ్రమదానం, మొక్కలు నాటడంతోపాటు గ్రామసభల్లో అందరూ కలిసి కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు