ఆకాంక్షకు ఆమోదం!

17 Feb, 2019 07:59 IST|Sakshi
విద్యుత్‌ లైట్ల వెలుతురులో నారాయణపేట జిల్లా పోలీసు కార్యాలయం 

 ‘పేట’ వాసులకు కేసీఆర్‌ జన్మదిన కానుక  నారాయణపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఉద్యమం ఫలం.. కలిసొచ్చిన ఎస్‌.ఆర్‌.రెడ్డి గెలుపు నేటి నుంచి మనుగడలోకి జిల్లా ఉదయం 6.45 గంటలకు ముహూర్తంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ సమయానికి జాతీయ జెండా ఆవిష్కరణ.. ఆ వెంటనే కలెక్టరేట్‌ ప్రారంభం  హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు 

నారాయణపేట : వలస జీవుల కేంద్రం.. వెనకబడిన ప్రాంతం... కరువుతో అల్లాడే రైతాంగం... ఇలా ఏ అంశంలో చూసుకున్నా నారాయణపేట ప్రాంతానికి వెనుకబాటు తనమే. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా.. అధికారుల పాలన చేరువ కావాలన్నా జిల్లాగా ఏర్పాటు చేయడమే మార్గమని ప్రజలందరూ ఆకాంక్షించారు.. కానీ 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన జిల్లాల పునర్విభజన సందర్భంగా వారికి నిరాశే ఎదురైంది. అప్పట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలుగా విభజించగా.. నారాయణపేట వాసులకు చుక్కెదురైంది. దీంతో సకల జనులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు.. బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు.. ఓ దశలో ‘పేట’ ఎమ్మెల్యే ఏకంగా తన పదవిని త్యజించేందుకు సిద్ధమయ్యారు.

దీంతో దిగొచ్చిన ప్రభుత్వం మంత్రు లు, ఎమ్మెల్యేలను దూతలుగా పంపించింది.. ఇప్పట్లో జిల్లా ఏర్పాటు సాధ్యం కాకున్నా మరోసారి విభజన అంటూ జరిగితే జాబితాలో తొలి పేరు నారాయణపేటే ఉంటుందని భరోసా ఇవ్వడంతో ప్రజలు ఆందోళనలు విరమించారు.. అలా రెండేళ్లు గడిచిపోయాయి.. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.. ఈ సందర్భంగా ప్రచారం కోసం నవంబర్‌ 25న నారాయణపేటకు వచ్చిన అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈసారి రాజేందర్‌రెడ్డి గెలిపిస్తే జిల్లా చేయడం ఖాయమని హామీ ఇచ్చారు.. అనుకున్నట్లుగా ఎస్‌.ఆర్‌.రెడ్డి గెలవడం, టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా కేసీఆర్‌ తన హామీని నెరవేర్చుకున్నారు.. రాష్ట్రంలోని ములుగుతో పాటు నారాయణపేటను కూడా జిల్లా ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.. ఈ జిల్లా ఆదివారం నుంచి మనుగడలోకి రానుండడంపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి

పండగలకు దూరంగా 
2016లో జిల్లాల పునర్విభజన చేపట్టిన సమయంలో అన్ని అర్హతలు ఉండి, డివిజన్‌ కేంద్రంగా కొనసాగుతున్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలని ఉవ్వెత్తున ఉద్యమించారు. జిల్లా సాధన సమితిగా ఏర్పడి అన్ని పార్టీ లు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. పండగలు కూడా చేసుకోకుండా రోడ్లపైనే గడిపారు. అయినా వారి ఆకాంక్ష నెరవేరలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఆయన పుట్టిన రోజైన 17వ తేదీ ఆదివారం నుంచి నారాయణపేట జిల్లాను మనుగడలోకి తీసుకొస్తూ ప్రకటన విడుదల చేయడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ జన్మదినం...‘పేట’కు వరం 
ఎన్నికల ప్రచారంలో భాగంగా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ నారాయణపేట బహిరంగ సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణపేట జిల్లాను ఇస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం డిసెంబర్‌ 31న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌పై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తి కావడంతో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు ఆమోదం తెలుపుతూ నారాయణపేట జిల్లా ఏర్పాటుపై జీఓ 19ను శనివారం విడుదల చేశారు.

ఇలా కేసీఆర్‌ పుట్టిన రోజున కొత్త జిల్లా మనుగడడలోకి రానుండడం అంతటా సంబరాలు నెలకొన్నాయి. కాగా, డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌కు.. తుది నోటిఫికేషన్‌కు ఒక్క మార్పు మాత్రమే జరిగింది. డ్రాఫ్ట్‌లో కోయిల్‌కొండ మండలాన్ని కూడా నారాయణపేట జిల్లాలో ఉంచగా.. స్థానికుల మనోభావాల దృష్ట్యా ఆ మండలాన్ని మహబూబ్‌నగర్‌లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నారాయణపేట జిల్లాలో కోయిల్‌కొండ మండలం మినహా నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా.. కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి మండలాలు వస్తున్నాయి. మొత్తంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మక్తల్, కోస్గి, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ, నర్వ, మరికల్, మద్దూరు మండలాల్లోని 252 గ్రామాలతో జిల్లా ఏర్పాటవుతోంది. 

ఆనందంగా ఉంది 
నారాయణపేట డివిజన్‌ పరిధిలోని ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం రోజున నూతన జిల్లాను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్‌ 25న ఇక్కడకు వచ్చిన కేసీఆర్‌ నన్ను ప్రజలు గెలిపిస్తే జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను గెలిపించిన ఈ ప్రాంత ప్రజానీకం కోరిక మేరకు తన హామీని నెరవేరుస్తూ జిల్లాను ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటా. నారాయణపేట జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం కృషి చేస్తా.  – ఎస్‌.రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట

మరిన్ని వార్తలు