మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?

9 May, 2020 04:28 IST|Sakshi

మృతుడు ఎలా చనిపోయాడో తెలియకపోతే ప్రమాదం

కరోనాతో మరణించినట్లయితే కుటుంబీకులకు వైద్య పరీక్షలు చేయొచ్చు

తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చు..

ప్రభుత్వం పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పాజిటివ్‌ వస్తే మృతుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తి కాకుండా చేయొచ్చని చెప్పింది. లేకపోతే ఎందుకు చనిపోయాడో ఎప్పటికీ తెలియదని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. కరోనా వైద్యం చేసే వారికి వైద్య పరికరాలిచ్చేలా ఉత్త ర్వులు జారీ కోరుతూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది.

పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ప్రాథమిక లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలిసిందని, ఇది మంచి నిర్ణయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా లక్షణాలుం టేనే పరీక్షలు చేసే విధానానికి ఉన్న శాస్త్రీయత ఏమిటో చెప్పాలని కోరింది. లక్షణాలున్న వారితో సన్నిహితంగా ఉన్న వారికి, కుటుంబసభ్యులకూ పరీక్షలు చేస్తేనే వైరస్‌ వ్యాప్తి కట్టడికి వీలుంటుందని తేల్చి చెప్పింది. వీటితోపాటు మృతదేహాలకు పరీక్షలు నిర్వహించకపోతే కరోనా వ్యాప్తి లెక్కలు తేలవని, పైగా గణాంకాల గారడీతో జనాన్ని మభ్యపెట్టడమే అవుతుందని వ్యాఖ్యా నించింది. ప్రభుత్వం వాస్తవ పరిస్థితుల కోణంలో చూడాలని, మనల్ని మనమే మోసం చేసుకోవద్దని హితవు పలికింది.

తొలుత పిటిషనర్‌ న్యాయవాది ప్రభాకర్‌ వాదిస్తూ.. జంటనగరాల్లోని 32 కంటైన్‌మెంట్‌ జోన్స్‌లోని వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు విధుల్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మార్గదర్శకాల్లో ప్రాథమిక లక్షణాలున్నవారికే పరీక్షలు చేయాలని ఏమీ లేదని గుర్తు చేసింది. కరోనా వైరస్‌ అనుమానితులతో పాటు కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడమే కాకుండా క్వారంటైన్‌ సెంటర్స్‌కు పంపాలని మార్గదర్శకాల్లో ఉందని చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు