రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

22 May, 2019 18:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ9 చానల్‌ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందుస్తు బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటిషన్‌ను ధర్మాసం కొట్టివేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. రవిప్రకాష్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగ్గా.. ఆయన తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది దిల్‌జిత్‌ సింగ్‌ ఆహువాల్య వాదనలు వినిపించారు. నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తుండగా పోలీసులు రవిప్రకాశ్‌పై అక్రమ కేసులు పెట్టారని, ఒకే వ్యక్తి పై మూడు చోట్ల వేర్వేరు కేసులు నమోదు చేశారని ఆహువాల్య వాదించారు. రవిప్రకాశ్‌ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

దీనికి కౌంటర్‌గా.. పోలీసుల ముందు హాజరు కావాలని ఇప్పటికే రవిప్రకాష్ రెండు సార్లు 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ఈ నోటీసులకు స్పందించకపోతే 41ఏ నోటీసులు కూడా ఇచ్చామని, వాట్సాప్ కాల్‌లో అందరితో రవిప్రకాష్ టచ్‌లో ఉంటున్నాడని, పోలీసుల విచారణకు మాత్రం హాజరు కావడం లేదన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41ఏ నోటీసుల తర్వాత ఈ స్టేజిలో బెయిల్ ఇవ్వలేమని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. 

ఇక​ అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌ టీవీ9 నూతన యాజమన్యమే తనపై తప్పుడు కేసులు పెట్టించిందని ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.  టీవీ9 స్థాప‌న ద‌గ్గర నుంచి అమ్మ‌కం వ‌ర‌కు చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయన ఈ వీడియోలో వివ‌రించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీవీ9 లోగో సృష్టికర్త తనేనని, అది తన సొంతమని పేర్కొన్నారు. రవిప్రకాశ్‌ వ్యాఖ్యలపై టీవీ9 నూతన యాజమన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులు పెట్టినప్పుడు పారిపోవడందేనికని ప్రశ్నించింది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

మరిన్ని వార్తలు