30 ఏళ్లు పైబడితేనే ఒంటరి మహిళలు!

12 Apr, 2017 01:23 IST|Sakshi
30 ఏళ్లు పైబడితేనే ఒంటరి మహిళలు!

అవివాహితల కనీస వయస్సు నిర్ధారించిన సర్కారు
ఏప్రిల్, మే ఆర్థికభృతి జూన్‌ 2 నుంచి చెల్లింపు
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ


సాక్షి, హైదరాబాద్‌: ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం పథకానికి సంబంధించి అవివాహి తలను ఒంటరి మహిళలుగా పరిగణించేం దుకు కనీస వయస్సు 30 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. అలాగే భర్త వదిలేసిన, భర్త నుంచి వేరుగా ఉంటున్న మహిళల విషయం లో కనీస వయస్సును 18గా నిర్ణయించిన ప్రభుత్వం, ఏడాదికి పైగా వారు విడిగా ఉండాలని స్పష్టం చేసింది. ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఆసరా పథకం కింద నెలకు రూ.1,000 ఆర్థిక భృతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్థికభృతి పథకానికి సంబంధించి ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. గురువా రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దరఖాస్తుల స్వీకరణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక భృతి పథకం ఏప్రిల్‌ 1 నుంచే వర్తింపజేస్తున్నప్పటికీ ఏప్రిల్, మే నెలల్లో అందాల్సిన భృతిని తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవమైన జూన్‌ 2 నుంచి అందజే యాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సమయం కావాలని జిల్లా కలెక్టర్లు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తహసీల్దారు ధ్రువీకరణ
భర్త నుంచి ఏడాదికి పైగా వేరుగా ఉంటున్న మహిళలను స్థానిక విచారణ ద్వారా తహసీల్దారు ధ్రువీకరించాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్‌ కలె క్టర్లతో దరఖాస్తుల పరిశీలన చేయించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారుల ఎంపికలో సమగ్ర కుటుంబ సర్వే, ఉన్నతి సర్వే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆర్థిక భృతి పొందుతున్న మహిళలు తిరిగి వివాహం చేసుకున్నా, మరణించినా..

 సదరు సమాచారాన్ని గ్రామంలోని బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్, పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు వెంటనే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తే ఆర్థిక భృతి నిలిపేస్తారు. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ ఆసరా పింఛన్లతో పాటే జరుగుతుంది. పథకం అమలుకు సంబంధించిన అంశాలను (సాఫ్ట్‌వేర్, సిబ్బంది, నిర్వహణ) గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి ప్రభుత్వం అప్పగించింది.

ఆధార్‌ ఉంటేనే ఆర్థిక భృతి
ఒంటరి మహిళల కేటగిరీలో ఆర్థికభృతికి దర ఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఆధార్‌ నంబ రు తప్పనిసరి కానుంది. వ్యక్తిగత దర ఖాస్తుతో పాటే ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్, వార్షికాదాయ పత్రం నకళ్లను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. కార్డున్న లబ్ధిదారుల ఆధార్‌ సంఖ్యను ఆధార్‌ ఇనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌)లో వెంటనే నమోదు చేస్తారు. కార్డులేని వారు ఆధార్‌ పొందేందుకు స్థానిక అధికారులు సహాయం చేయాలని ప్రభుత్వం సూచించింది. వేలిముద్రలు లేదా ఐరిష్‌ ఆధారంగానే ఆర్థిక భృతి చెల్లించనున్న నేపథ్యంలో ఆధార్‌ నంబరు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు