రిమాండ్‌లోని ముగ్గురూ హైకోర్టులో హాజరు

21 Dec, 2019 04:51 IST|Sakshi

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణకు తెర

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ముగ్గురిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లుగా హైకోర్టు ప్రకటించింది. చైతన్య మహిళా సంఘం సంయుక్త కార్యదర్శులు డి.దేవేంద్ర, ఎం.స్వప్న, తెలంగాణ విద్యార్థి వేదిక ప్రధాన కార్యదర్శి ఎం.సందీప్‌లను పలు కేసుల్లో అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారని, దీనిలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండలోని చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ ముగ్గురినీ హైకోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.

దీంతో పోలీసులు ముగ్గురినీ హైకోర్టులో హాజరుపర్చారు. ముగ్గురి నుంచి స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశాలపై వేరే రూపంలో న్యాయపోరాటం చేసేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఉందని.. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో తమ పరిధి పరిమితమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఆ ముగ్గురితో వారి తల్లిదండ్రులు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయంలో కలుసుకుని మాట్లాడుకునేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు