అందమైన హైదరాబాద్‌ను నరకంగా మార్చేస్తారా..

29 Feb, 2020 04:00 IST|Sakshi

ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం

నిద్రపోయేందుకా జీతాలంటూ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ స్థలాలను రక్షించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్రమణలను అడ్డుకోలేకపోతున్నారని, జీతాలు తీసుకుని నిద్రపోతున్నారంటూ ఘాటువ్యాఖ్యలు చేసింది. మార్చి 24న జరిగే విచారణకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు హైకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈలోగా అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలను వివరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా ఐదేళ్లకోసారి వాటిని క్రమబద్ధీకరణకు జీవో జారీ చేయడం సరైంది కాదంది.

సుందరమైన హైదరాబాద్‌ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడుకోకపోతే ముంబై, పట్నా తరహాలో నరకప్రాయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలో అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ శివారి మరొకరు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు అడ్డుకోకుండా నిద్రపోతున్నారా అని వ్యాఖ్యానించిం ది. జీహెచ్‌ఎంసీలో ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రత్యేక విభాగం ఉందా అని ప్రశ్నించింది. అధికారులు తమ విధుల్ని నిర్వహించకపోతే హైకోర్టే ఆ పనులు చేయాల్సివస్తుందని తేల్చిచెప్పింది. 

మరిన్ని వార్తలు