అక్కడ ఎందుకు అనుమతించడంలేదు!

10 Aug, 2017 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరసన దీక్షల వంటి కార్యక్రమాలకు అనుమతినివ్వ కపోవడంపై ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగ నాథన్, జస్టిస్‌ జె.ఉమా దేవిల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ధర్నాచౌక్‌ వద్ద ఎటువంటి నిరసన కార్యక్రమాలకూ ప్రభుత్వం అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది
పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ... ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ప్రభు త్వం వ్యవహరిస్తోందన్నారు. ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమాలకు అనుమతినివ్వకపోవ డం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘నిరసన తెలియచేసే హక్కు ఈ దేశ ప్రజలందరికీ ఉంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం లేకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టొచ్చు. అయితే ఫలానా ప్రాంతంలోనే నిరసనలు పెట్టుకోనివ్వండని మేం ప్రభుత్వానికి ఎలా ఆదేశాలివ్వగలం’ అని ప్రశ్నించింది.

 అందు బాటులోలేని శంషాబాద్, షామీర్‌పేట, జవహర్‌నగర్, మేడిపల్లి తదితర చోట్ల నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చునని ప్రభుత్వం చెబుతోందని ప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ స్పందిస్తూ ఇందిరాపార్క్‌ వద్ద నిరసన కార్యక్రమాల నిర్వహణ వల్ల స్థానికులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.  వాదనలు విన్న ధర్మాసనం... ఇప్పుడు అధికారంలో ఉన్నవారు గతంలో ఎక్కడ ఏం చేశారో మర్చిపోవద్దని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు