వైద్యుల నిర్లక్ష్యం వల్లే రవికుమార్‌ మృతి

14 Jul, 2020 04:43 IST|Sakshi

చెస్ట్‌ ఆస్పత్రి ఘటనపై అభిప్రాయపడ్డ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: చెస్ట్‌ ఆస్పత్రిలో రవికుమార్‌ అనే యువకుడు కరోనా వల్ల మరణించలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడి ప్రాణం పోయిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటిలేటర్‌ తీసేయడం వల్లే అతడు చనిపోయాడని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.యశ్‌పాల్‌గౌడ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సకాలంలో వైద్యం అందకే రవికుమార్‌ మరణించారని, వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉందని పిటిషనర్‌ న్యాయవాది ప్రియాంక చౌదరి వాదించారు. ఇప్పటికే రవికుమార్‌ వీడియో వైరల్‌ అయ్యిందన్నారు. దీనిపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నివేదిక కప్పదాట్లతో ఉండకూడదని.. బాధ్యులు ఎంతటి సీనియర్‌ డాక్టర్లు అయినా చర్యలు ఉండాలని పేర్కొంది. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది.

>
మరిన్ని వార్తలు