దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: హైకోర్టు ఆదేశాలు

9 Dec, 2019 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం సోమవారం మధ్యాహ్నాం 2:30 గంటలకు విచారణ చేపట్టింది. శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.

ముందుగా ప్రకటించిన మేరకు సోమవారం ఉదయమే విచారణ జరపాల్సి ఉన్నా.. ఎన్‌కౌంటర్‌పై మరో పటిషన్‌ దాఖలు కావడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రెండు పిటిషన్లు కలిపి ధర్మాసనం విచారణ చేపట్టింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిపారని పలు మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా ప్రకటించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. మృతదేహాలను సోమవారం రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని హైకోర్టు ఇదివరకే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాలలో మృతదేహాలను ఉంచారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: సిట్‌ కీలక భేటీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సోమవారం భేటీ అయ్యారు. చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలానికి సిట్ బృందం మంగళవారం వెళ్లనుంది. మొత్తం మూడు దశల్లో విచారణ జరపనున్న సిట్.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారులను ప్రశ్నించనుంది. ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిణామాలు, దిశ కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరించనున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన అధికారులతోపాటు.. ఘటనాస్థలిలో పంచనామా చేసిన అధికారులను సైతం సిట్ విచారించనుంది.ఈ ఘటనపై షాద్‌నగర్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌ను సిట్ పరిశీలించనుంది. అలాగే ఘటన తర్వాత సంఘటనా స్థలంలో పోలీసులు సేకరించిన వస్తువులను పరిశీలించనుంది.

ఏడుగురు సభ్యుల ఈ సిట్‌ బృందానికి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వం వహి​స్తున్న సంగతి తెలిసిందే. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, రాచకొండ ఐటీ సెల్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిలు ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వం ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు, దానికి దారి తీసిన పరిస్థితులపై సిట్‌ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.


విచారణకు సుప్రీం అంగీకారం..
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సెగలు సుప్రీంకోర్టును తాకాయి. దిశ హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జి.ఎస్‌.మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్లో కోరారు. ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలుచేయాల్సిందిగా ఆదేశించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిందేకు న్యాయస్థానం అంగీకరించింది.

మరిన్ని వార్తలు