రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ..

20 Nov, 2019 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ తీర్మానం చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స‍్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ జడ్జ్‌మెంట్‌లను పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. మూడు రోజుల లోపు ఉద్యోగులు సమ్మె విరమణ చేసి ఉద్యోగంలో చేరకపోతే 5001 రూట్లను ప్రయివేటీకరణ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇందులో దురద్దేశం దాగుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

ప్రైవేటీకరణ పరుగులు పెడుతుంటే ఇంకా 1947లోనే ఉందామా?
‘ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటీకరణ మన దేశంలోనూ పరుగులు పెడుతోంది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. ఎయిరిండియా గుత్తాధిపత్యం పోయి ఎన్నో ఎయిర్‌లైన్స్‌ వచ్చాయి. రైల్వేలోనూ ప్రైవేటీకరణ జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఆర్టీసీ గుత్తాధిపత్యం నుంచి సమాతరంగా ప్రైవేట్‌ రూట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న కేబినెట్‌ ప్రతిపాదన చట్ట వ్యతికమని ఎక్కడ ఉందో చెప్పండి. సుప్రీంకోర్టు కూడా పెట్టుబడిదారీ విధానాలకు అనుగుణంగా వచ్చిన చట్టాలకు లోబడి తీర్పు చెబుతోంది. కాలం మారుతోంది. జనం కూడా మారుతున్నారు. అందుకు అనుగుణంగా చట్టాలు కూడా వస్తున్నాయి. రూట్ల ప్రైవేటీకరణకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తూ పార్లమెంట్‌ చట్టం చేసింది. ఈ నేపథ్యంలో మనం ఇంకా 1947 నాటి సోషలిస్టు విధానాలే ఉండాలంటే ఎలా’ అని హైకోర్టు  మంగళవారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తోంది.

అది విశ్వాసరాహిత్యమే: పిటిషనర్‌
తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న తరుణంలో రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం విశ్వాసరాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నా.. వాటిని అమలుచేసే సందర్భం కీలకమని, సమ్మె చేస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ చేయడం వెనుక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు. కార్మిక సంఘాలను చర్చలకు కూడా ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని.. సయోధ్య చర్చల నుంచి యూనియన్‌ నేతలు వాకౌట్‌ చేయడంతో చర్చలు విఫలమైనట్లు కన్సిలియేషన్‌ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక ఇక చర్చలకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది.
చదవండి: రూట్ల ప్రైవేటీకరణ.. తొలిదశలోనే తప్పుపట్టలేం!

మరిన్ని వార్తలు