పెంచిన ఫీజులో 50% మాత్రమే చెల్లించండి

21 May, 2020 02:55 IST|Sakshi

మిగిలిన 50 శాతానికి బాండ్‌ ఇవ్వండి 

కన్వీనర్‌ కోటా విద్యార్థులకు హైకోర్టు ఆదేశం 

పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజుల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు... ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజులపై జోక్యం చేసుకోని ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పీజీ మెడికల్‌ కోర్సులకు సంబంధించి 2016లో పెంచిన ఫీజులకు అదనంగా ప్రస్తుతం పెంచిన ఫీజులో 50% మాత్రమే చెల్లించాలని కన్వీనర్‌ కోటా ఏ కేటగిరీ విద్యార్థులకు హైకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన 50 శాతానికి కాలేజీ పేరుమీద బాండ్‌ సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 20పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే యాజమాన్యపు కోటా ‘బీ’కేటగిరీ విద్యార్థులు 2016లో పెంచిన ఫీజుకు అదనంగా ప్రస్తుతం పెంచిన ఫీజులో 60% చెల్లించాలని, మిగిలిన 40 శాతానికి బాండ్‌ సమర్పించాలని స్పష్టం చేసింది.

విద్యార్థులు చెల్లించిన ఫీజులు, బాండ్లు ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని, ఇబ్బందిని దష్టిలో పెట్టుకుని మధ్యే మార్గంగా ఈ ఉత్తర్వులిచ్చినట్లు పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని 2017లో దాఖలైన వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

సవాల్‌ చేసిన వైద్య విద్యార్థులు 
పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం 20ని సవాలు చేస్తూ 121 మంది వైద్య విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పీజీ మెడికల్‌ కోర్సుల్లో కన్వీనర్, యాజమాన్యపు కోటాల కింద ఫీజులను భారీగా పెంచారని తెలిపారు. ఇంత భారీగా ఫీజులు పెంచేందుకు కారణాలేమిటో తెలియడం లేదన్నారు. మెడికల్‌ కాలేజీల తరఫున పలువురు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, బోధనా, బోధనేతర సిబ్బందికి పెద్ద మొత్తంలో జీతాలు, విద్యార్థులకు స్టైఫండ్‌ చెల్లింపులు చేయాల్సి వస్తోందని, దీంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని తెలిపారు.

ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫీజు ఖరారుకు నిర్దిష్ట విధానాన్ని అనుసరించామని, ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం, ఏఎఫ్‌ఆర్‌సీ దేని ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించిందో ఆ వివరాలను తమ ముందు లేవని, ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కూడా ఫీజుల పెంపునకు కారణాలు చెప్పలేదని పేర్కొంది. అటు విద్యార్థులు, ఇటు కాలేజీల ప్రయోజనాలను సమతుల్యం చేసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ ధర్మాసనం పైవిధంగా ఆదేశించింది. ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు విషయంలో మాత్రం ధర్మాసనం జోక్యం చేసుకోలేదు.

మరిన్ని వార్తలు