సంక్షేమ విధానాన్ని రూపొందించండి

3 Jun, 2020 08:48 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం..   

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక్‌ రైళ్లలో పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదింపులు చేసి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రంలోని వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు పంపేందుకు ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వలస కార్మికులను ప్రభుత్వ ఖర్చులతోనే పంపాలని, సుప్రీంకోర్టు/కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విపత్తులు సంభవించినప్పుడు వలస కార్మికుల తరలింపు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు నిర్దిష్ట విధానాన్ని ఖరారు చేయాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని కూడా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. (మేరా భారత్‌ మహాన్‌ కావాలంటే..)

రెండు వ్యాజ్యాలపై మరోసారి విచారణ 
ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులపై ఎస్‌.జీవన్‌కుమార్‌.. లాక్‌డౌన్‌ కారణంగా మేడ్చల్‌ రోడ్డులో మండుటెండలో నడిచి వెళ్లే వలస కార్మికులపై ప్రొఫెసర్‌ రమా శంకర్‌ నారాయణ మేల్కొటి దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. వలస కార్మికుల గురించి హైకోర్టు నియమించిన అడ్వొకేట్‌ కమిషన్‌ కౌటూరు పవన్‌కుమార్‌ తమ నివేదికను ధర్మాసనానికి నివేదించారు. మేడ్చల్‌ జాతీయ రహదారిలో వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారని కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఇటుక బట్టీల్లో ఇంకా 20 వేల మంది వరకు వలస కార్మికులున్నారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. అయితే లక్షన్నర మంది వరకు ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులు ఉండిపోయారని పిటిషనర్‌ న్యాయవాది వసుధా నాగరాజన్‌ వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. నిజంగానే ప్రభుత్వం వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపి ఉంటే ఇప్పటికీ వారంతా రోడ్లపై, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో ఎందుకున్నారని ప్రశ్నించింది. (సీఎం ఇంటికి బాంబు బెదిరింపు)

బస్సుల్ని డిపోలకే పరిమితం చేయడానికి బదులు వాటిని వినియోగించి వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు పంపొచ్చునని సూచన చేసింది. వలస కార్మికుల నుంచి టికెట్ల చార్జీలను వసూలు చేస్తే ప్రభుత్వమే చట్టాలను ఉల్లఘించినట్లు అవుతుందని హెచ్చరించింది. ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్రంలో 1,081 ఇటుక బట్టీల్లో పనిచేసే 53,145 మంది కార్మికుల్లో 23,332 మందిని ఇప్పటికే తరలించామన్నారు. వలస కార్మికుల కోసం ఆహారం, వసతి, వైద్యం వంటివి కల్పిస్తున్నామన్నారు. అడ్వొకేట్‌ కమిషన్‌ పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడ్చల్‌ రోడ్డులో వెళ్లే వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ పరిసరాలకు తీసుకురండి.
వలస కార్మికులను హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిసరాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ‘ఈ విధంగా తరలించిన వారిని రైలు, బస్సుల్లో ఉచితంగా వారి ప్రాంతాలకు పంపే చర్యలు తీసుకోవాలి.. వారికి నివాసయోగ్యమైన ఫంక్షన్‌ హాల్స్‌లో వసతి ఏర్పాట్లు చేయాలి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తదితర ప్రాంతాలకు శ్రామిక్‌ రైళ్ల సంఖ్య పెంపునకు రైల్వే శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయలేనప్పుడు సాధారణ రైళ్లలో వలస కార్మికుల కోసం 4 ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలి. ఇలా తరలించే వారి పేర్ల నమోదుకు వీలుగా తెలుగురాని వారి కోసం ప్రత్యేక చర్యలు అవసరం. బస్సుల్లో వారి రాష్ట్ర సరిహద్దులకు తరలించి అక్కడి నుంచి ఆయా రాష్ట్రాలు తమ కార్మికుల్ని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలి. (సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక!)

షెల్టర్‌లోని నివాసమున్న పిల్లలు, బాలింతలు, మహిళలు, వృద్ధులు, రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వీరికి సరైన ఆహారం, తాగునీరు, వైద్యం అందజేయాలి. ఇటుక బట్టీల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని వారి గురించి వివరాలు సేకరించి నివేదిక రూపొందించాలి. దాని మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు ఉచిత బస్సు రవాణా ఏర్పాట్లు చేయాలి. కార్మికుల తరలింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫలితాలను నివేదించాలి..’అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు